హైదరాబాద్: పార్లమెంట్లో కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ కొత్త మలుపు తిరిగింది. మొన్న రోహిత్ వేముల అంశంపై మంత్రి మాట్లాడుతున్నపుడు బీఎస్పీ అధినేత్రి మాయావతి అడ్డుపడుతూ అతని ఆత్మహత్యపై దర్యాప్తుకు ఏర్పాటు చేసిన కమిషన్లో దళితులు ఒక్కరు కూడా లేరని ఆరోపించారు. దానికి మంత్రి బదులిస్తూ ఒక దళితుడు ఉన్నారని, తన సమాధానంపై సంతృప్తి చెందకపోతే తల నరుక్కుని పాదాలముందు పెడతానని చెప్పారు.
ఇవాళ ఇదే అంశంపై మాయావతి రాజ్యసభలో మాట్లాడుతూ, మంత్రి సమాధానంపై తమ పార్టీ సంతృప్తి చెందలేదని, మరి చెప్పిన మాటల ప్రకారం మంత్రి తన తల నరుక్కుంటారా అని ప్రశ్నించారు. దీనికి స్మృతి బదులిస్తూ, తాను సిద్ధంగా ఉన్నానని, తన తల నరికి తీసుకు వెళ్ళేందుకు బీఎస్పీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ రావచ్చని చెప్పారు. మొత్తానికి ఇద్దరు నాయకురాళ్ళ మధ్య చర్చ వాడి, వేడిగా సాగింది.