ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ ను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ, భాజపా ఫెయిల్ అయ్యాయన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు పవన్ కల్యాణ్ లో చూస్తున్నారన్నారు. విభజన తరువాత రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందనీ, ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదనీ, అందుకే ఇక్కడ కొత్త నాయకత్వం అవసరమన్నారు మాయావతి. ఏపీలో బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో జనసేన నాయకత్వంలో కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందనీ, తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణ్ అన్నారు మాయావతి.
జాతీయ రాజకీయాల్లో పరిస్థితి మారాయనీ, కాంగ్రెస్ పార్టీవారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానీ, ప్రస్తుతం భాజపా కూడా అదే పరిస్థితిలో ఉందన్నారు మాయావతి. గడచిన ఐదేళ్లలోవారేం సాధించారో చెప్పలేకనే ఇతర అంశాలవైపు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తాను ఏదైనా చేసి చూపించడమే తప్ప, దాని గురించి ఎక్కువగా మాట్లాడమని మాయావతి అన్నారు. కేంద్రంలో తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే… అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కచ్చితంగా ఇచ్చి తీరతామని మాయావతి స్పష్టం చేశారు. ఆంధ్రాలో పవన్ దోస్తీ అనేది ఎవరివో ఓట్లు చీల్చి, ఇతరులకు లాభపడటానికి కాదనీ… తమ పోరాటం తమదే అన్నారు మాయావతి. కేంద్రంలో మూడో కూటమి ఏర్పాటు అంశమై మాయావతి మాట్లాడుతూ… ఎన్నికల ఫలితాల తరువాతి పరిస్థితులపై అది ఆధారపడి ఉంటుందన్నారు.
ఏపీ ప్రత్యేక హోదాకి మాయావతి హామీ ఇవ్వడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమెకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ హోదా విషయంలో కాంగ్రెస్, భాజపాలు రెండూ వైఫల్యం చెందాయనీ, మాయావతి మాట ఇచ్చారంటే.. ఆమె కచ్చితంగా చేసి తీరతారంటూ పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక ఛాయ్ వాలా ప్రధాని కాగలిగినప్పుడు… ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర దశాదిశా మార్చిన స్థాయికి ఎదిగిన మాయావతి ఎందుకు కాకూడదన్నారు పవన్. ఆమె నాయకత్వం అవసరమన్నారు. మొత్తానికి… మాయావతి ప్రెస్ మీట్ ద్వారా ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యూహంతో ఉన్నారనేది కొంత స్పష్టమైనట్టే!