బహుజన సమాజ్ వాది పార్టీ నేత మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ 2019 లోక్సభ ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచింది అని, అలా గెలిచి ఇప్పుడేమో బిజెపియేతర రాష్ట్రాలని కబళిస్తోందని మాయావతి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం సంగతి అందరికి తెలిసిందే. ఈ సంక్షోభానికి కారణం బిజెపియే అని మాయావతి అన్నారు. అదే విధంగా గోవాలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపి లోకి విలీనమయ్యారు. 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 10 మంది బిజెపిలో చేరడం తో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లు సైతం బిజెపి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంది అంటూ విమర్శలు చేయడం తప్ప మరేమీ చేయలేక పోతున్నారు. అయితే ఇలా గోవా , కర్ణాటక అంటూ ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రాన్ని బిజెపి టార్గెట్ చేస్తోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దేశం మొత్తం 29 రాష్ట్రాలలో జెండా ఎగురవేయాలి అన్న మిషన్ తో బిజెపి పనిచేస్తోందని, రాజకీయంగా బలపడాలి అన్న ఆశ తప్పు కానప్పటికీ దానికోసం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీయడం మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలలో కూడా కొంతవరకు ఇదే రకమైన చర్చ జరుగుతోంది.
అంతేకాకుండా, ఎన్నికల లో బిజెపి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచిందని పదేపదే మాయావతి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి చాలామంది రాజకీయ నాయకుల నుండి మద్దతు రానప్పటికీ, ప్రజలలో కూడా ఒక వర్గం లో ఈవీఎం ట్యాంపరింగ్ మీద అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద బిజెపి ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందన్న వ్యాఖ్యల మీద, విపక్షాలని అణిచేస్తూ రాష్ట్రాలను కబళించి వేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందన్న మాయావతి వ్యాఖ్యల మీద చర్చ జరుగుతోంది.