మార్కెట్ లో బ్రాండ్ లకు ఉన్న వాల్యూ వేరు. బ్రాండ్ ని బట్టే ధర డిసైడ్ అవుతుంది. చిత్రసీమలోనూ అంతే. పేరున్న రచయిత కథ ఇస్తే – ఆ కథ ఎలా ఉన్నా, అందులో విషయం లేకపోయినా కోట్లకు కోట్లు పెట్టేస్తారు నిర్మాతలు. ‘మజాకా’ విషయంలో అదే జరిగింది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. అందుకోసం రూ.2.5 కోట్లు తీసుకొన్నారు. రెండున్నర కోట్లు ఓ రచయితకు వెచ్చించారంటే భూమి బద్దలైపోయే కథ అయ్యుంటుందని అంతా అనుకొంటారు. కానీ తీరా చూస్తే `మజాకా` కథలో అన్ని మెరుపులేం లేవు. తండ్రీ – కొడుకులు ఒకే సారి ప్రేమలో పడడం మినహాయిస్తే కొత్త పాయింట్ ఏం కనిపించలేదు. దానికి తోడు సెకండాఫ్‌లో వచ్చే కాన్ ఫ్లిక్ట్ తేలిపోయింది. ఈమాత్రం కథకు రెండున్నర కోట్లు ఎందుకిచ్చారన్నది పెద్ద ప్రశ్న.
ఈ సినిమాకు ప్రసన్నకుమార్ ఒక్కడే రైటర్ కాదు. ఐదారుగురు పని చేశారు. అందరూ కలిసి తలో చేయి వేసి రాసిన కథలోనే బోలెడన్ని మైనస్సులు కనిపించాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ కథ నాదే అంటూ మరో రచయిత రైటర్స్ అసోసియేషన్‌లో పంచాయితీ పెట్టాడు. ఈ మేటర్ చిరంజీవి వరకూ వెళ్లిందని తెలుస్తోంది. సదరు రచయితకు రూ.25 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొన్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో నిజానిజాలేంటన్నది ప్రసన్నకుమార్ కే తెలియాలి. నక్కిన త్రినాథరావు – ప్రసన్నకుమార్ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్టే. అందుకే ఈ రైటర్‌కు అంత డిమాండ్ ఏర్పడింది. దాన్ని ప్రసన్న కూడా బాగానే క్యాష్ చేసుకొన్నాడు. కాకపోతే కథలోనే మేటర్ లేదంతే.