దేశ రాజకీయాలకు ఒక ఆశాకిరణాన్నంటూ దూసుకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ ప్రకాశం క్రమేపీ క్షీణిస్తోంది. ఢిల్లీ పరిథిలోని మూడు కార్పొరేషన్లలోనూ ఆప్ దారీతెన్నూ తెలియకుండా పోయింది. ఒకానొక దశలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కష్టంమీద దాటి రెండో స్థానంలో నిలిచింది. యథాప్రకారం జెంటిల్‌మేన్ కేజ్రీవాల్ తప్పును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై నెట్టేశారు. అందులోని లోపాల వల్లే తమ పార్టీ ఓటమి పాలైందన్నారు. క్షణం ఆలస్యం చేయకుండా పనిలో పనిగా ఎన్నికల సంఘానికి ఓ ఫిర్యాదు కూడా అందించేశారు. చొక్కాపై బురద వేసేసి, కడుక్కోమన్న చందంగా కేజ్రీ వైఖరి తయారైంది. విద్యుత్తు చార్జీలనూ, నీటి చార్జీలనూ విపరీతంగా పెంచేస్తూ తీసుకున్న నిర్ణయాల్ని ఆయన పక్కన పెట్టేశారు. సామన్యుడిని సౌకర్యమంతంగా ఉంచలేని ఏ ప్రభుత్వమూ మనజాలదన్న సూత్రాన్ని ఆయన విస్మరించారు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి, కేంద్రంపై విరుచుకుపడడమే. ఎన్నో ప్రధాన సమస్యల్ని విడిచిపెట్టి, ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని నిరూపించడానికి ఇంకా నానా తంటాలూ పడుతున్నారు. ఢిల్లీ ప్రజలు తనకు అద్వితీయ విజయాన్ని అందించిన విజయాన్ని తన బలుపుగా భావించారు. తానేమి చేసినా చెల్లుతుందనుకున్నారు. కోతికి కొబ్బరి కాయ ఇస్తే ఏమవుతోందో, ఆయన చేతికి దక్కిన అధికారం కూడా అలాగే తయారైంది. పంజాబ్‌లో ఓటమితోనైనా ఆయన తన పరిథిని తెలుసుకునుంటే ఈ గతి పట్టేది కాదు. ప్రతిపక్ష హోదా దక్కిందన్న తృప్తి తప్ప ఏమీ మిగలలేదు కేజ్రీవాల్‌కు.
కేజ్రీవాల్‌పై ప్రజలకు విశ్వాసం పోయిందనీ, ప్రధాని నరేంద్రమోడీపై మోజుతోనే తమకు పట్టం కట్టారనీ భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చంకలు గుద్దుకున్నారు. ఆప్ వైఖరితో విసిగి, ఓటర్లు బీజేపీ పట్టం కట్టారు తప్ప, ఇది పాజిటివ్ ఓటు కాదని వారు గుర్తించడం లేదు. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత దేశంలో ఓ సారి ప్రతిపక్షానికి అవకాశమిచ్చి చూద్దామని ఓటరు ఏనాడు భావించలేదు. అధికార పక్షంపై విముఖతతోనే రెండో పక్షాన్ని అందలమెక్కిస్తూ వస్తున్నారనేది నిష్టుర సత్యం. మధ్యలో కుల, మత, ప్రాంతీయ సమీకరణాలు ఎటూ ఉండనే ఉన్నాయి. వీటన్నింటి మధ్య పార్టీలు అందలమెక్కడమో, మట్టి కరవడమో అవుతూ వస్తోంది. అలాగని ఇక్కడ బీజేపీ విజయాన్ని తక్కువ చేసి చూపించడం లేదు. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఢిల్లీపై ఉందనుకోవడంలో సందేహం ఎంతమాత్రం లేదు.
ఎటొచ్చీ దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీయే. మూడో స్థానానికి పడిపోవడంతో ఊపిరాడక దిక్కులు చూస్తోంది. ఆ పార్టీ నాయకులు అజయ్ మాకెన్, చాకో రాజీనామాలిచ్చేశారు. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు మాకెన్ అయితే, ఏకంగా ఏడాదిపాటు పార్టీలో సాధారణ కార్యకర్తలా మాత్రమే మెలుగుతానని ప్రకటన చేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో పక్క చూపులుచూస్తున్న పార్టీల నేతలు చేరి, భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మరింత బలపడేటట్లే కనిపిస్తోంది. నీళ్ళు నిండా ఉంటేనేగా చెరువులో కప్పలు బెకబెకలాడుతూ చేరేది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి