బాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీదత్తా.. ” మీ టూ” క్యాంపైన్.. ఓ కేంద్రమంత్రి కుర్చీ కిందకు నీళ్లు తీసుకొచ్చింది. తనూశ్రీదత్తా ఏ ఉద్దేశంతో నానా పటేకర్‌పై విమర్శలు చేసిందో కానీ… లైంగిక వేధింపులకు గురైన వారు ధైర్యం తెచ్చుకుని ప్రముఖుల బండారం బయట పెడుతున్నారు. ఈ క్రమంలో… కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎం.జె.అక్బర్.. లైంగిక వేధింపుల ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఆయన తమను లైంగికంగా వేధించినట్లు… ఆరుగురు మహిళా విలేఖరులు ఆరోపణలు చేశారు. తాజాగా తనకు పద్దెనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు.. ఏషియన్ ఏజ్ పత్రిక ఇంటర్నీగా ఉన్నప్పుడు.. అక్కడ ఎడిటర్గాఉన్న అక్బర్..తనను అసభ్యంగా ముద్దు పెట్టుకున్నారని.. ప్రస్తుతం సీఎన్ఎన్లో రిపోర్టర్గాఉన్న “మజ్లి డి కాంప్” అనే విదేశీ జర్నలిస్ట్ కొత్తగా ఆరోపణలు గుప్పించారు.
అక్బర్ వ్యవహారం రాను రాను.. తీవ్రంగా మారుతోంది. ఇలాంటి ఆరోపణలపై విచారణకు… ఓ కమిటీని నియమించారు. అయితే… సహాయ మంత్రి ఎం.జె.అక్బర్‌ను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతోంది. సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో… కేంద్రమంత్రులు పడిపోయారు. అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ నిరాకరించారు. అయితే మరో మంత్రి మేనకా గాంధీ మాత్రం ఈ ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్బర్‌పై వచ్చిన “మీటూ” ఆరోపణలపై ఇప్పటికే కేంద్రం పూర్తి వివరాలు సేకరిస్తోంది. అక్బర్ నైజీరియా నుండి తిరిగి వచ్చే సమయానికి ఆయనపై ప్రధాని చర్య తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ వ్యవహరాల సహాయ మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అక్బర్‌ను పదవి నుంచి తప్పించడమే మేలని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కేబినెట్లోని ఓ మంత్రిని.. ఇలాంటి కారణాలతో తొలగిస్తే.. అది పెద్ద మచ్చగా ఉండిపోతుందని.. బీజేపీలోని కొన్ని వర్గాలు సందేహిస్తున్నాయి. ఒక వేళ తొలగించకపోతే… మొత్తానికే మోసం వస్తుందని మరికొంత మంది వాదిస్తున్నారు. మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..!