లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి తనపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశాలని చెప్పి ఆయన ఎదురు దాడి చేసే ప్రయత్నం చేశారు. తనపై ఆరోపణలు చేసిన ప్రియారమణి అనే జర్నలిస్ట్ పై పరువు నష్టం దావా వేసి.. ఏకంగా 97 మంది లాయర్లను నియమించుకున్నారు.అయితే.. ఆ తర్వాత కూడా.. ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఏషియన్ ఏజ్ పత్రికకు.. ఎడిటర్ గా ఉన్న సమయంలో… తమను వేధింపులకు గురి చేశారంటూ.. ఒక్కసారే పదిమందికిపైగా జర్నలిస్టులు ఆరోపణలు గుప్పించడంతో… ఎంత ఎదురుదాడి చేసినా… బయటపడటం కష్టమని తేలిపోయింది. ఈ పరిణామాలతో… పరువు పోతూండటంతో… చివరికి… ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా రాజీనామా చేయాలని… ఎంజె అక్బర్ కు సూచించినట్లు తెలుస్తోంది.
బేటీ బచావో.. బేటీ పడావో’నినాదంతో మహిళా సాధికారత అంటూ హడావుడి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఎంజే అక్బర్ వివాదంతో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయనకు మద్దతుగా మాట్లాడటమంటే పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుకోవడమేననే అభిప్రాయం కేంద్ర కేబినెట్లోని తోటి మంత్రుల్లోనే వ్యక్తమయింది. అక్బర్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నవంబరులో ఆ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. అక్బర్ వ్యవహారం రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉండటంతో ఆయనను రాజీనామా చేయించడానికి మరో కారణంగా చెబుతున్నారు.
అక్బర్‌ను తొలగించాలనే విషయంలో కాంగ్రెస్ మాత్రమే కాదు.. ఆరెస్సెస్ కూడా.. ఒత్తిడి తెచ్చింది. నైతిక విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆర్ఎస్ఎస్ ఇప్పటికే బీజేపీ ముఖ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అక్బర్ రాజీనామాతో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై తప్పుకున్న మూడో వ్యక్తి అయ్యారు. 2017 జనవరిలో మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్, 2018 ఆగస్టులో కేంద్ర మంత్రి నిహాల్ చంద్ మేఘ్వాల్ లైంగిక వేధింపుల ఆరోపణలతోనే ఉద్వాసనకు గురయ్యారు. .