బాలీవుడ్‌తో పాటు.. రాజకీయాల్ని షేక్ చేస్తున్న “మీ టూ” ఉద్యమం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను హడలెత్తించడానికి సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా బడా హీరోలు.. దర్శకులు, నిర్మాతల లైంగిక వేధింపుల వ్యవహారాల్ని బయటపెట్టడానికి…మహిళా నటీమణులు, సాంకేతిక నిపుణులు సిద్ధమయ్యారు. ఈ మేరకు… ప్రముఖ యాంకర్ సుమ కనకాల నేతృత్వంలో.. కార్యాచరణ జరుగుతోంది. తమపై జరిగిన లైంగిక వేధింపుల్ని ఎలా బయపెట్టాలా అన్న అంశంపై.. సుమ కనకాల ఆధ్వర్యంలో.. నటీమణులు, సాంకేతిక నిపుణులు… ఫిల్మ్ చాంబర్ బిల్డింగ్‌లో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశం… “మీ టూ”లో వ్యవహరించాల్సిన విధివిధానాల గురించి చర్చిస్తున్నారు. మరో యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినీ రెడ్డి కూడా.. సమావేశానికి హాజరై కీలకంగా వ్యవహరిస్తున్నారు.
గతంలో శ్రీరెడ్డి అనే నటీమణి … ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్ని తీసుకొచ్చి సంచలనం రేపే ప్రయత్నం చేసినప్పుడు.. ఇండస్ట్రీ లైట్ తీసుకుంది. మీడియా చేతుల్లోకి వెళ్లి రచ్చ రచ్చ అయిన తర్వాత… మహిళలపై వేధింపులకు విచారణ అంటూ ఓ కమిటీ వేశారు కానీ.. దాని గురించి తర్వాత ప్రస్తావన లేదు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా.. తనూశ్రీదత్తా ప్రారంభించిన “మీ టూ” క్యాంపైన్.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అందరూ భయపడకుండా.. తమ తమ పై జరిగిన లైంగి వేధింపుల ఘటనలను బయటపెడుతున్నారు. దీనికి టాలీవుడ్ అగ్ర హీరోయిన్లు సమంత, కాజల్, అనుష్కలు ఎప్పటికప్పుడు మద్దతుగా మాట్లాడుతున్నారు. వీరి మద్దతు.. సుమ కనకాల అండ్ కో ప్రయత్నాలకు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిల్మ్ చాంబర్లో సుమ కనకాల నేతృత్వంలో సాగుతున్న సమావేశంలో ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్‌ను చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంతగా వేధించినా.. మరణించిన నటులు, దర్శకులు, నిర్మాతల గురించి మాత్రం మాట్లాడకూడదని నిబంధన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారు సమాధానం ఇచ్చుకోలేరు కాబట్టి.. ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నారు.
ఇక ఈ విషయంలో వారు బయటపెట్టాలి అనుకుంటే.. చాలా మంది పెద్ద నటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు బయటకు వస్తాయి. ఇంత కాలం… ఏం జరిగినా.. టాలీవుడ్లో అంతర్గతంగా అందరికీ తెలిసిపోతుంది. కానీ… ఎవరూ బయటకు చెప్పుకోరు. అలాంటి ఘటనలు .. ఇప్పుడు “మీ టూ” ద్వారా బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఎంత మంది భయం లేకుండా.. వీటిని బయపెడతారాన్నది సందేహమే. ఎందుకంటే.. కెరీర్ కూడా చూసుకోవాలిగా.. అన్నది చాలా మంది ఆలోచన..! ఎవరెవరు.. “మీ టూ” అంటూ బయటకు వచ్చి పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారి బాగోతాల్ని బయటపెడతారో వేచి చూడాలి..!