బొత్స సత్యనారాయణ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాజధాని మార్పు లాంటి వివాదాస్పద అంశాలను ప్రకటించడానికి బొత్స సత్యనారాయణ లాంటి నాయకులను వైఎస్ఆర్సిపి ముందు పెడుతోందని, మంచి విషయాలను ప్రకటించడానికి మాత్రం తన కుటుంబానికి చెందిన ( అన్యాపదేశంగా- తన సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు అన్న అర్థం వచ్చేలా) నేతలను వైకాపా పార్టీ ముందు పెడుతోందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే వీటి కంటే ఎక్కువగా వైరల్ అయిన వ్యాఖ్య ఏమిటంటే, ” వైఎస్సార్సీపీ తరఫున బొత్స ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
https://www.telugu360.com/te/pawan-kalyan-warns-botsa-satyanarayana/
అయితే వైఎస్ఆర్సిపి లాంటి ప్రాంతీయ పార్టీల లో ముఖ్యమంత్రి అభ్యర్థి మారే పరిస్థితి అత్యంత అరుదుగా వస్తూ ఉంటుంది. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లినప్పుడు తన భార్య రబ్రీ దేవి ని ముఖ్యమంత్రి చేస్తే, జయలలిత గతంలో తాను జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పన్నీర్ సెల్వం ని ముఖ్యమంత్రిగా చేసింది. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ ని చంద్రబాబు చీల్చినప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మార్పు అనేది ప్రాంతీయ పార్టీ లో జరిగింది. ఏతావాతా అర్థమయ్యే దేమిటంటే, ఇటువంటి ప్రాంతీయ పార్టీల లో ముఖ్యమంత్రి మార్పు అనేది పార్టీ చీలిపోయినప్పుడు, లేదంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లినప్పుడు – అలాంటి కీలక పరిణామాలు జరిగినప్పుడు మాత్రమే జరిగింది. ఇప్పుడు బొత్స సత్య నారాయణ వైఎస్సార్సీపీ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ కారణంతోనే వైరల్ అవుతున్నాయి. జగన్ జైలుకు వెళితే తప్ప వైఎస్సార్సీపీ తరఫున బొత్స ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అన్నది అందరికి తెలిసిందే. జగన్ మీద ఉన్న కేసుల దృష్ట్యా అటువంటి ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మర్మం గా అర్థం అవుతోంది.
ఈ వ్యాఖ్యల పై బొత్స సత్యనారాయణ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.