దేశంలో కరోనా కేసులు పెరుగుతూండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పెద్ద ఎత్తున కేసులు..మరణాలు నమోదవుతున్నాయి. దీంతో సెకండ్ వేవ్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. పరిమితంగా కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి కూడా. ఈ సమయంలో నరేంద్రమోడీ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రోజు పార్లమెంట్ ఉభయసభల్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం అవుతారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారు. కరోనా పెరుగుతున్న కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు తీసుకుంటారు.
ఆ తర్వతా కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యూరప్ లాంటి దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే.. ఇండియాలో మాత్రం మళ్లీ లాక్ డౌన్ అమలు చేసే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. ఒక సారి అమలు చేసిన లాక్‌డౌన్‌కే అర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఇప్పుడు లాక్ డౌన్ అంటే.. మొదటికే మోసం వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా కేంద్రం కూడా ఆ ఆలోచన చేయకపోవచ్చంటున్నారు. అయితే.. ఏదో ఓ చర్యలు తీసుకోకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.
అందుకే.. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునే చాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. కానీ పేరుకే.. ఎవరూ పాటించడం లేదు. చివరికి కరోనా నిబంధనలు పాటించి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఫలితంగా ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఈ కారణంగా కరోనాను కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు.