దీపావళి ధమాకా అంటే ఏమిటో చూసేసింది బాక్సాఫీస్. పండగ రోజున విడుదలైన మూడు సినిమాలూ (అమరన్, లక్కీ భాస్కర్, క) ప్రేక్షకుల్ని రంజింపజేశాయి. మంచి వసూళ్లు దక్కాయి. గతవారం మాత్రం నిరాశగా సాగింది. మట్కా, కంగువా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. మరీ ముఖ్యంగా భారీ అంచనాలమధ్య విడుదలైన కంగువా రిజల్ట్ సూర్య అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈలోగా మరో వారం కొత్త సినిమాలతో ముస్తాబైంది. ఈసారి కూడా జోరుగానే సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ‘మెకానిక్ రాకీ’,’జీబ్రా’, ‘దేవకీ నందన వాసుదేవ’, ‘రోటీ కపడా రొమాన్స్’, ‘కేసీఆర్’, ‘మందిర’ ఇలా అరడజను సినిమాలు వరుస కట్టాయి.
విశ్వక్సేన్ నటించిన చిత్రం మెకానిక్ రాకీ. ట్రైలర్లో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ చేసిన హాట్ కామెంట్లతో ఈ సినిమాపై మరింత ఫోకస్ పడింది. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. వారి ఈ గ్లామర్ ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కానుంది. సత్యదేవ్ ‘జిబ్రా’పై గట్టి నమ్మకాలు పెట్టుకొన్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చిరంజీవి రావడంతో హైప్ పెరిగింది. సత్యదేవ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. ‘దేవకీ నందన వాసుదేవ’పై కూడా మంచి బజ్ ఉంది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఆయన కథల్లో ఫాంటసీ అంశాలు చాలా ఉంటాయి. ఈ సినిమాకీ అదే ప్లస్ పాయింట్ కానుంది. వీటితో పాటు కేసీఆర్, మందిర కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మెకానిక్ రాకీ, జీబ్రా మాస్ సినిమాలు కాబట్టి, వీటికి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ‘దేవకీ నందన..’ ప్రమోషన్లు కూడా గట్టిగానే చేస్తున్నారు. మిగిలిన సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్ల వరకూ వెళ్లాలంటే మౌత్ టాక్ చాలా అవసరం.