వైసీపీలో చేరుతున్నానని ప్రకటించిన రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.. జగన్‌తో భేటీ అయిన తర్వాతి రోజే… తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కానీ చేయలేదు. ఆయనకు ఉన్న విప్ పదవికి రాజీనామా చేశారు కానీ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ స్పీకర్‌కు పంపలేదు. అలాగే.. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పదవికి… రాజీనామా చేస్తున్నట్లు గొప్పగా ప్రకటించి దీక్ష చేసిన మాజీ మంత్రి మాణిక్యాలరావు కూడా ప్రకటన రాజీనామానే చేశారు. ఆయన స్పీకర్‌కు లేఖ పంపలేదు. దాంతో … వారి రాజీనామాలు రాలేదు కాబట్టి.. స్పీకర్‌కు ఆమోదించాలనే ఆప్షన్ లేదు. కానీ… ఇతర పార్టీల్లో చేరి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన రావెల కిషోర్, ఆకుల సత్యనారాయణలు మాత్రం మాజీలయ్యారు.
ఇరువురి ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తూ రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ లో వారితో మాట్లాడిన అనంతరం మంగళవారం సాయంత్రం వారి రాజీనామాలను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన లో చేరిన రావెల కిషోర్ బాబు, బిజెపికి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ రాజీనామాలను ఆమోదించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరుపున గెలుపొందిన రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జనసేనలో చేరారు. తన రాజీనామా లేఖను సీల్డ్ కవర్ లో స్పీకర్ కు పంపారు. స్పీకర్ ఆ రాజీనామా లేఖను పరిశీలించి మంగళవారం రావెల కిషోర్ బాబుతో ఫోన్ లో మాట్లాడారు. అమోదించమని రావెల కోరడంతో వెంటనే ఫైల్ పై సంతకం చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అదే విధంగా రాజమండ్రి నుంచి బిజెపి తరుపున గెలుపొందిన ఆకుల సత్యనారాయణ కూడా ఆ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు .ఆయన రాజీనామా లేఖపై కూడా స్పీకర్ నేరుగా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు .ఆయన కూడా ఆమోదించాల్సిందిగా కోరారు. అనంతరం వీరిరువురి రాజీనామాలను ఆమోదించి ఫైల్ ను పంపారు.
కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆయన విప్ పదవికి రాజీనామా లేఖ మాత్రమే స్పీకర్ కు అందింది. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా లేఖ మాత్రం తమకు అందలేదని స్పీకర్ కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ నేటి వరకు ఆ రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి అందలేదని అధికారులు ప్రకటించారు.