కడప జిల్లా రాజంపేట తెలుగుశం పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన వైసీపీలో చేరడం ఖాయమని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడాతో పాటు ఆయన ఇద్దరు సోదరులు కూడా వైసీపీలో చేరనున్నారు. గత ఆరు నెలలుగా.. మేడా మల్లిఖార్జునరెడ్డి వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఉంది. మేడా సోదరులు.. వైసీపీ అధినేత జగన్ తో సన్నిహితంగా ఉంటారు. వైఎస్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగా… వారు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గతంలో రెండు సార్లు చంద్రబాబు పిలిపించి.. ఎలాంటి సమస్యలు వచ్చినా పార్టీ పరంగా అండగా ఉంటామని చెప్పి పంపించారు. అయినా సోదరుల ఒత్తిడితో మేడా మల్లిఖార్జునరెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయన పోటీ చేయరని.. ఆయన సోదరుడు రఘునాథరెడ్డి పోటీ చేస్తారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
మరో వైపు ఉదయం రాజంపేటకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అమరావతిలోని చంద్రబాబు ఇంటికి వచ్చారు. చంద్రబాబుతో వారితో రాజంపేట పరిస్థితిని సమీక్షించారు. మేడా మల్లిఖార్జున రెడ్డి కొంత కాలంగా పార్టీని పట్టించుకోవడం లేదని.. వైసీపీ నేతలతోనే వ్యవహారాలు నడుపుతున్నారని.. అనర్హుడ్ని అందలం ఎక్కించారని.. వారంతా చంద్రబాబుకు చెప్పుకున్నారు. మేడా మల్లిఖార్జునరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. అప్పటికే.. మేడా… వైసీపీలో చేరడం ఖాయమన్న సమాచారం రావడంతో.. ఆయనను.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు. మేడా మల్లికార్జునరెడ్డిని ఎమ్మెల్యేను చేసి.. శాసనసభ విప్‌గా నియమించామన్నారు. మేడా తండ్రిని టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించారు. ఐదేళ్లు పదవులు అనుభవించి.. ఎన్నికలు సమీపించగానే వెళ్లిపోయారని చంద్రబాబు విమర్శించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రాజంపేట టిక్కెట్ ఆశిస్తున్న వారు కూడా చంద్రబాబుతో సమావేశానికి వచ్చారు. ప్రవాస ప్రముఖుడు వేమన సతీష్ కూడా రేసులోకి వచ్చారు. సీఎం ఆదేశిస్తే రాజంపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. రాజంపేట సీటు గెలిపించి సీఎంకు కానుకగా ఇస్తామన్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో 9 వైసీపీ గెలుచుకుంది. రాజంపేట ఒక్కటి మాత్రం టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా.. వైసీపీలో చేరిపోయారు. అయితే. అంతకు ముందే వైసీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు జమ్మల మడుగు ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిలో ఆదినారాయణరెడ్డి మంత్రిగా ఉన్నారు.