మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని అక్కడ ఉంలేకపోతున్నారని వచ్చేస్తామని ఫోన్లు చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. వారు అక్కడ ఉన్నా కాంగ్రెస్ కే పని చేస్తారని పార్టీ నేతలకు చెబుతున్నారు.
కానీ బీఆర్ఎస్ నేతలకు అసలు మల్లారెడ్డి మీదనే డౌట్ ఉంది. ఆయన కాంగ్రెస్ కో.. బీజేపీకో కోవర్టుగా పని చేస్తున్నారని నమ్ముతున్నారు. ఇటీవల మల్కాజిగిరి ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ను కలిసి మీదే గెలుపని ప్రకటించారు. ఈ విషయం వివాదాస్పదమయింది. మామూలుగా అన్నానని ఈటల కూడా బీఆర్ఎస్ లోనే పెరిగారని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత స్థానిక సంస్థలకు చెందిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరిపోయారు. మేడ్చల్ జిల్లాకు చెందిన వారు జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్లు, మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు, నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మేడ్చల్ నుంచి చాలా మంది కాంగ్రెస్ లో చేరినా ఆపలేదని ఆయనపై పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఆఫ్ ది రికార్డ్ తాను బీఆర్ఎస్ లో ఉంబోనని కాంగ్రెస్ లేకపోతే బీజేపీలో చేరుతానని చెబుతూ ఉంటారు. కానీ మళ్లీ బీఆర్ఎస్ లో హడావుడి చేస్తూంటారు. ఓ సందర్భంలో మల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరిగింది. బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తోనూ చర్చించారు. అయితే తన కుమారుడికి ఎంపీ టిక్కెట్ అడిగినట్లుగా చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడంతో చేరిక ఆగిపోయిందని చెబుతున్నారు. మరి ఆయననే బీఆర్ెస్ కోవర్టుగా పరిగణించే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి.