హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను అన్నిటినీ విజయవాడ తరలించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిలో కొన్నిటి కోసం గన్నవరం సమీపంలో గల మేథా ఐటి టవర్స్ లోకి తరలించాలని భావిస్తోంది. సుమారు 1.7 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆ భవనం అయితే సుమారు 5-6 వేల మంది ఉద్యోగులు పనిచేసుకోవడానికి సరిపోతుంది. ఆ భవనం విజయవాడకి సమీపంలో ఉండటం, అన్ని హంగులతో వినియోగానికి సిద్దంగా ఉండటం వంటి అనేక కారణాల చేత దానిని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అయితే అది ఐటి స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధిలో ఉంది కనుక కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డీ-నోటిఫై చేయవలసి ఉంటుంది. అదీగాక అందులో ప్రస్తుతం మూడు ఐటి కంపెనీలకు చెందిన సుమారు 250 మంది ఐటి ఉద్యోగులు పనిచేస్తున్నారు. కనుక ఆ భవనాన్ని ఉపయోగించుకోవాలంటే ముందుగా ఆ మూడు ఐటి కంపెనీలకి వేరే చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అందుకు ఆ మూడు సంస్థలు అంగీకరించవలసి ఉంటుంది.
ప్రభుత్వం వాటిని విశాఖలో ఐటి పార్క్ కి తరలించాలని భావిస్తోంది. కానీ అవి ప్రస్తుతం ఐటి స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉన్నందున అవి కొన్ని ప్రత్యేక రాయితీలు పొందుతున్నాయి. కనుక వాటిని వేరే చోటకి తరలించాలంటే వాటికి ప్రత్యామ్నాయ కార్యాలయాలతో బాటు రాయితీలను కూడా కల్పించవలసి ఉంటుంది. లేకుంటే అవి బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవచ్చును. ఆ మూడు ఐటి కంపెనీలతో ఎపి.ఐ.ఐ.సి. సంస్థ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే వాటిని వేరే చోటికి తరలించి, డీ-నోటిఫై చేస్తామని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి పల్లె రఘునాధ రెడ్డి తెలిపారు.