వైసీపీ పార్టీలోనే కాదు సాక్షి మీడియాలోనూ గందరగోళం నెలకొంది. అక్కడివ్యక్తుల ఆధిపత్య పోరాటాల కారణంగా సంస్థ పని తీరు రోజు రోజుకు మసకబారుతోంది. తాజాగా భారతిరెడ్డి తరపున ప్రతినిధిగా సంస్థల్ని నిర్వహించే రాణి రెడ్డి అనే టాప్ ఎగ్జిక్యూటివ్ ను తొలగించారు. ఇక ఆఫీసుకు రావొద్దని ఆమెకు సమాచారం ఇచ్చినట్లుగా సాక్షి వర్గాలు చెబుతున్నాయి.
భారతి రెడ్డికి బంధువుతో పాటు ఫ్రెండ్ లాంటి రాణి రెడ్డి చాలా కాలంగా సాక్షి మీడియాపై అజమాయిషీ చేస్తున్నారు. టీవీకే కాదు పేపర్ కు కూడా ఆమె కీలకం. ఆమె చెప్పేది మాత్రమే భారతి వింటారు. అందుకే ఆమెకు పట్టు చిక్కింది. ఆమె ప్రత్యేకంగా తన వర్గం అనుకునేవారిని పెంచి పోషించిందని అంటారు. ఇష్టం లేని వారిని సాగనంపడానికి ప్రత్యేకమైన వ్యూహాలు పాటించేవారు. అందుకే అంతా ఆమె చెప్పినట్లుగా వినేవారు అక్కడ ఉన్నారు. పై స్థాయిలో రాణిరెడ్డి తీరుపై అసంతృప్తి ఉంది. కానీ ఎవరూ ఫిర్యాదులు చేసేంత సాహసం కూడా చేసేవారు కాదు.
అయితే హఠాత్తుగా రాణి రెడ్డిని తొలగించాలని భారతి నిర్ణయించారు. రెండు నెలల నోటీసు ఇచ్చారు. నోటీసు సమయంలో కూడా రావాల్సిన అవసరం లేదని.. సంస్థ వ్యవహారాల్లో ఇక జోక్యం అవసరం లేదని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇలా ఎందుకు అన్నది చాలా మందికి అర్థం కాని విషయంగా మారింది. అయితే ఇటీవల పేపర్లో వచ్చిన టీడీపీ కోటి మంది సభ్యత్వాల ప్రకటన కారణంగానే రాణి రెడ్డిని తొగిస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. నిజమేంటో వారికే తెలియాలి.