సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే గొప్ప జర్నలిజం అనుకునే పరిస్థితి వచ్చేసింది. టీవీ చానళ్లపై కొంతమంది చెలరేగిపోతున్నారు. ఆరేళ్ల పాపను అత్యాచారం చేసి హత్య చేస్తే కవరేజీ ఇవ్వలేదు కానీ అదే సాయి ధరమ్ తేజ అనే నటుడికి యాక్సిడెంట్ అయితే మాత్రం రోజుల తరబడి చూపిస్తున్నారు.. ఇదేం మీడియా అని చెలరేగిపోతున్నారు. అలాంటి వార్తలకు రోజుల తరబడి ప్రచారం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
చిన్నారిపై దారుణానికి కవరేజీ ఇవ్వలేదని టీవీ మీడియాలో సోషల్ మీడియాలో విమర్శలు !
చిన్నారిపై అత్యాచారం హత్య జరిగిన అంశంపై కవరేజీ ఇవ్వని దానికి సోషల్ మీడియాలో చాలా మంది మేధావుల పేరుతో టీవీ చానళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సెన్సేనలిజానికి టీవీ మీడియా అంకితమైందని నీతి బోధనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆరేళ్ల పాపను ఓ కీచకుడు అత్యాచారం, హత్య చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అత్యంత బాధాకరమైన విషయం. ఆ ఘటనపై టీవీ చానళ్లు న్యూస్ ఇచ్చాయి. అలా ఇవ్వబట్టే బయట ప్రపంచానికి తెలిసింది. కానీ ఎక్కువ మంది సోషల్ మీడియా మేధావుల ఉద్దేశం మారధాన్ న్యూస్ ఇవ్వాలని. అంటే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు ఇచ్చినట్లుగా రోజంతా న్యూస్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోవడంతోనే వారికి ఆగ్రహం వచ్చింది.
ప్రజలు ఏది చూస్తే అది ఇస్తామంటున్న టీవీ మీడియా !
పాప పై దారుణం విషయాన్ని మరో నిర్భయలాగా చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని వాళ్ల ఆశ కావొచ్చు. కానీ ఏ వార్తకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మీడియా నిర్ణయించుకుంది. ప్రజలకు ఏది చూస్తారనుకుంటే అదే టీవీ చానళ్లు చూపిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. తమకు అందుబాటులో ఉన్న న్యూస్‌లో అత్యధిక మంది ఏ వార్తను ఆసక్తిగా చూస్తారో ఆవార్తను పిక్ చేసుకుని ఎయిర్ చేసుకుంటాయి. అలా చేసుకుంటేనే రేసులో ఉంటాయి. అక్కడా అదే చేశారు. న్యూస్ ప్రయారిటీని ఎంచుకున్నాయి. దానికే చేతులో రాసుకోవడానికి సోషల్ మీడియా ఉంది కదా అని కొంత మంది చెలరేగిపోతున్నారు. ఆరేళ్ల పాప విషయంలో జరిగింది దారుణం. ఆ పాపకు.. కుటుంబానికి న్యాయం చేయడానికి.. ఆ నిందితుడ్ని కఠినంగా శిక్షించడానికి మీడియా కవరేజీకి ఏం ఉంటుంది సంబంధం ?
సాయి తేజ్ కుటుంబానికీ టీవీల వల్ల మనోవేదనే..! దొందూ .. దొందే..!
అలా అని టీవీ చానళ్లనూ సమర్థించలేం. సాయి తేజ్ గురించి అదే పనిగా కవరేజ్ ఇచ్చారని ఆ కుటుంబం అయినా సంతోషంగా ఉంటుదా అంటే అదేం లేదు. సాయి తేజ్ గురించి రకరకాల రూమర్స్ ప్రచారం చేసి.. మొత్తానికే ఆ వర్గం నుంచి కూడా టీవీ మీడియా విమర్శలు ఎదుర్కొంటోంది. సాధారణ మీడియాను ప్రస్తుతం సోషల్ మీడియా డామినేట్ చేస్తోంది. కానీ అక్కడ 90 శాతం ఫేక్ న్యూస్. రాజకీయ పార్టీలు సోషల మీడియా సైన్యాలను పెట్టుకుని ఫేక్ న్యూస్‌తో విజృంభిస్తున్నాయి. ఆయా పార్టీల సానుభూతిపరులు ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నా.. ఎంతో తెలివిగలవారమని ట్యాగులు తగిలించుకున్నా..ఈ ఫేక్‌న్యూస్‌లు స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వారే ఇప్పుడు డైరక్ట్ మీడియాపై దాడికి తెగబడుతున్నారు. ఏ వార్తలకు ఎంత కవరేజీ ఇవ్వాలో నిర్దేశిస్తున్నారు. కానీ దొందూ.. దొందుగానే మారిపోయాయి.