సంతకు చీటి, లచ్చికి గాజులు అన్నట్టుగా… సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి చర్చ మొదలుపెడితే, చివరికి ఆ అంశాన్ని చర్చల్లోకి తెచ్చిన మీడియాపైనే నిషేధానికి సినీ పెద్దలు సిద్ధమౌతున్న వైనం చూస్తున్నాం. ఈ వివాదంతో ఏమాత్రం సంబంధం లేని… ఛానల్స్ లో ప్రకటనలూ, సినిమా ఫంక్షన్ల కవరేజీపై లాభ నష్టాల చర్చ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూస్ టీవీ ఎడిటర్స్ అసోసియేషన్ సూటిగా కొన్ని ప్రశ్నలను సినీ పెద్దలకు సంధించింది. త్వరలో కొన్ని ఛానెల్స్ పై నిషేధం తప్పదంటూ వస్తున్న లీకుల నేపథ్యంలో సూటిగా కొన్ని అంశాలకు సినీ పెద్దలు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. ఆ ప్రశ్నలు ఇవిగో..!
కొంతమంది సినీ పెద్దలు పరిశ్రమ తరఫున మాట్లాడకుండా, కుల సంఘ నేతలుగా విమర్శలు చేస్తూ మీడియాపై దాడి చేయడం సరైందా..? క్యాస్టింగ్ కౌచ్ గురించి చర్చ మొదలుపెడితే, మీడియా బ్యాన్ అంశం ఎందుకు తెరమీదికి వచ్చింది..? నిజానికి, పవన్ కల్యాణ్ ఉద్దేశించి శ్రీరెడ్డి వాడిన బూతు పదజాలాన్ని బీప్ సౌండ్ వేసి మీడియా ప్రసారం చేస్తే, ప్రసారం కాని ఫుటేజ్ జనంలోకి తీసుకొచ్చి, దాంతో మీడియాపై ద్వేషం ఎందుకు వెళ్లగక్కుతున్నట్టు..? శ్రీరెడ్డిని తానే తిట్టమన్నానని ఆర్జీవీ చెబితే, మీడియా ప్రోద్బలంతోనే ఆర్జీవీ అలా చెప్పారంటూ మీడియాని ప్రజల్లో ఎందుకు పలచన చేస్తున్నారు..? నిరాధారమైన ఆరోపణల్ని ప్రాతిపదికగా తీసుకుని, కొంతమంది అల్లరి మూకలతో మీడియాపై దాడులు చేయడం సరైందా..?
టీవీ మీడియాపై నిషేధానికి సిద్ధమౌతున్న కొంతమంది పెద్దలు, తద్వారా రెండు మీడియాల మధ్య శాశ్వత శతృత్వాన్ని కారకులం అవుతున్నామని అంచనా వేసుకోవడం లేదా..? మీడియాపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోలో పెద్దలంతా సమావేశమైతే… దాని గురించి జనసేన ప్రకటన విడుదల చేయడమేంటి, ఈ సినీ పెద్దలు జనసేనలో చేరారా..? మీడియాపై నిషేధ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తుంటే.. వారి గొంతుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కొంతమందితో ఏర్పాటు చేసిన కమిటీని ఫిల్మ్ ఛాంబర్ ఆమోదించినట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారేంటీ..? నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణలను ప్రాతిపదికగా చేసుకుని, కొన్ని ఛానెల్స్ కి సినీ ప్రకటనలు ఆపేయాలని అనుకోవడం సరైందా..? వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు, స్వీయ నియంత్రణలో భాగంగా శ్రీరెడ్డి చర్చని టీవీ మీడియా తగ్గించింది. అయినాసరే, ఇంకా రెచ్చగొట్టే విధంగా నిర్ణయాలుంటే.. సినీమా-మీడియా మధ్య సంబంధాలు చెడిపోతాయని తెలీదా..?
ఇలా సూటిగా కొన్ని ప్రశ్నలు వేసింది న్యూస్ టీవీ ఎడిటర్స్ అసోసియేషన్. అంతేకాదు, మీడియాలో లేని లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం మీరు చేస్తే… సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల్లోని లోపాలను తాము నిరంతరం చూపించే ప్రయత్నం మొదలు పెట్టొచ్చా.. అంటూ హెచ్చరిక కూడా చేసింది. ఈ ప్రశ్నలు సదరు సినీ పెద్దల్ని ఆలోచింపజేస్తాయో లేదో చూడాలి. నిజానికి, ఈ మొత్తం వివాదం ఒక వర్గ ప్రయోజనాలను కాపాడటం కోసం, మరో వర్గాన్ని బలహీన పరచడమే లక్ష్యంగా జరుగుతున్నదే అనే అనుమానాలు మొదట్నుంచీ ఉన్నాయి. ఆ దిశగానే కొన్ని ఛానెల్స్ ను టార్గెట్ చేసుకున్న విధానం చూస్తూనే ఉన్నాం. ఈ వివాదానికి ముగింపు ఎక్కడనేది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నే..!
[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2018/05/EDITOR-ASSOCIATION.pdf” title=”EDITOR ASSOCIATION”]