ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి టీవీ చానళ్లపై నిషేధం విధించిందని, టీవీ ఛానళ్లకు యాడ్లు ఇవ్వకుండా నిలుపువేయాలని, ట్రైలర్లు టీజర్లు, ఆడియో ఫంక్షన్ల ఇన్పుట్లు కూడా ఇవ్వకుండా ఆపాలని నిర్ణయం తీసుకుందని ఓ వార్త పుట్టుకొచ్చింది. సినిమా వాళ్లని చులకనగా చూస్తూ, సినిమా వాళ్లపై నెగిటీవ్ వార్తలు రాస్తూ టీఆర్పీ రేటింగులు పెంచుకుంటున్న టీవీ ఛానళ్లని పెంచిపోషించాల్సిన అవసరం లేదని చిత్రసీమ భావించిందని, అందుకే ఈ దిశగా అడుగులు వేసిందని ఆ వార్త సారాంశం. టాలీవుడ్ కొన్ని టీవీ ఛానళ్లపై గరమ్ గరమ్గా ఉన్న వార్త వాస్తవం. కొన్ని ఛానళ్లకు యాడ్లు ఇవ్వకూడదన్న విషయంలో నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నదీ వాస్తవమే. కాకపోతే.. మీడియాని దూరం పెట్టడానికి ఏ ఒక్కరూ సాహసించడం లేదు. ఇటీవల అన్నపూర్ణ ఏడు ఎకరాల్లో జరిగిన సినీ పరిశ్రమ కీలక సమావేశంలోనూ ఇదే విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే చాలామంది ఈ నిర్ణయంపై విభేదించార్ట. టీవీ ఛానళ్లను నిషేధిస్తే.. నెగిటీవ్ వార్తలతో మరింత విజృంభిస్తాయని, యాడ్లకు ఇచ్చే డబ్బులు కన్నా.. వాటి వల్ల వచ్చే కవరేజీ అధికంగా ఉంటుందని అగ్ర నిర్మాతలంతా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఒకవేళ టీవీ ఛానళ్లని నిషేధిస్తే దిన పత్రికలలో కూడా కవరేజీ రాదని, కీలకమైన ఛానళ్ల చేతిలో ప్రముఖ దినపత్రికలు ఉన్నాయని, అవి కూడా కవరేజీలు ఇవ్వవని గుర్తు చేసినట్టు సమాచారం. అందుకే టీవీ ఛానళ్లని బ్యాన్ చేసే సాహసం టాలీవుడ్ చేయకపోవొచ్చు. కాబట్టి ఈ వార్తలో నిజం లేనట్టే.