మీడియాను ఎదుర్కోవడం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు తెలిసినట్టు మరెవరికీ తెలీదని నిరూపితమైపోయింది. మంగళవారం క్యాబినెట్ సమావేశానంతరం ఆయన మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు దీనికి ప్రబలమైన సాక్ష్యం. ఒక రకంగా చెప్పాలంటే మీడియాతో ఆయన ఆడుకున్నారనడం అతిశయోక్తి కాదేమో. విలేకరులు అడుగుతున్న తీరు కూడా కేసీఆర్ ఎక్కడ తమపై కోపగించుకుంటారో అన్న చందంగా సాగింది. ఒక్క రిపోర్టరు కూడా ఆత్మవిశ్వాసంతో ప్రశ్న వేసినట్లు కనిపించలేదు.
కేసీఆర్‌ను నిలదీయాలంటే ఎన్నో అంశాలున్నాయి. వేటినీ వారు సద్వినియోగం చేసుకోలేదు. ఏమడిగితే ఏ ఇబ్బంది వస్తుందోనన్న చందంగా అంటీముట్టనట్లు ప్రశ్నలడిగారు. పాపం విలేకరులను అనే బదులు.. కేసీఆర్ వాక్చాతుర్యానికి వాళ్లు ఫ్లాట్ అయిపోయారనడం బాగుంటుంది. క్యాబినెట్ సమావేశాల వివరాలను సాధారణంగా పౌరసంబంధాల శాఖ మంత్రి లేదా మరొకరో వెల్లడిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావే ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. ఆయన చెబితే శిలాశాసనమన్నట్లు అందరూ భావించాలనేది ఆయన ఉద్దేశమై ఉండొచ్చు. రిజర్వేషన్ల అంశంలో తాము తమిళనాడును తాము మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నామని చెబుతూ, వద్దని కేంద్రాన్ని చెప్పమనండి, సుప్రీం కోర్టుకు వెడతామంటూ తొడగొట్టారు. వద్దనదు ఎందుకంటే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నది పార్టీ కాదు… ప్రభుత్వం అంటూ ధీమాగా చెప్పారు. బీజేపీకి రిజర్వేషన్ల పిచ్చుంటే.. మా పార్టీ ప్రజల పిచ్చి అంటూ విచిత్రంగా అన్నారు. ఈ నెల 14నుంచి 15రోజులపాటు గులాబీ పనిదినాలను ప్రకటించడం వెనుక వ్యూహం కనిపించింది. ఏ ఊరివారు ఆ ఊళ్ళోనే పనిచేసుకునేలా గులాబీ పనిదినాలను నిర్దేశించారు. తానూ రెండు రోజులు పనిచేస్తానని ప్రకటించడం ద్వారా ఉద్యమ సమయంలో నిధుల సేకరణకు హెలికాప్టర్లో తనకు కలిసి ప్రయాణించే అవకాశం ఇవ్వడం, కూలీ చేయడం, తనతో భోజనం చేయడం తదితర అంశాల ద్వారా డబ్బును సమకూర్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. నాయకుడే పనిచేస్తానంటే సాధారణ పౌరులు ఎందుకు చేయరు.. కచ్చితంగా చేస్తారు. అలాగే, ఆ పనిచేయడానికి వచ్చేవారికి ఆ ఊళ్ళోనే పనులు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వంపైనే పడుతుంది. ఎండాకాలంలో పనుల కోసం దూరాభారాలు పోనవసరం లేకుండా తీవ్రత ఉన్న రోజుల్లో ప్రజలకు కొద్దిపాటి బాధైన తప్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చెప్పచ్చు.
ఈ ఒక్క సందర్భంలో తప్ప కేసీఆర్ మీడియా ముందుకు రావడం తక్కువే. వచ్చారో… అన్ని అంశాలనూ అరటి పండు వలిచినట్టు చెబుతారు. అందులో సందేహాలుండడానికి అవకాశమే లేదు. ఉందీ అని అంటే మరింత విపులంగా చెబుతారాయన. నీ ప్రశ్నలోనే సమాధానముందనీ కొన్నిసార్లు అనేస్తుంటారాయన. తెలంగాణకు కరెంటు విషయం వచ్చేసరికి, ఇది పాత పాలకుల పాపమని చెప్పేసి తప్పించుకున్నారు. మాకు కరెంటు రాకుండా చేద్దామనుకున్నరు.. ఏమైంది… తెలంగాణలో కరెంటు కోతే లేకపోయె అంటూ చెప్పుకొచ్చారు. ఎక్కడ నుంచి ఎలా కరెంటు తెచ్చుకుంటున్నదీ కూడా చెప్పారు.
మీడియా సమావేశాలను ఎదుర్కోవడంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్ చాలా మెరుగు. ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురైతే.. చంద్రబాబు చిరాకు పడిపోతారు. తాను చెప్పిందే వినాలని శాసిస్తారు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. ఏ పేపర్ నీది అని రంకెలేస్తారు. కేసీఆర్ శైలి కూడా ఇంచుమించు ఇంతే. కానీ ఆయన ఎదుర్కునే తీరు చమత్కారంగా ఉంటుంది. మాటల గారడీ ఉంటుంది. తన భాషా పటిమతో ప్రశ్నించిన వారిని అవాక్కు చేసేయగల సత్తా కేసీఆర్‌కుంది. నన్నే ప్రశ్నిస్తావా అనే తత్వం చంద్రబాబుది. ఇద్దరి మధ్య మౌలికంగా ఒక ముఖ్యమైన అంశం ఉంది. అదే ఆత్మ విశ్వాసం. ఇద్దరు చంద్రులకూ తమతమ రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీ ఉంది. కానీ, కేసీఆర్‌లో ఉన్న ఆత్మవిశ్వాసం చంద్రబాబులో లేదు. కారణాలు అనేకం. అందరికీ తెలుసున్నవే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమూ లేదు.
Subrahmanyam vs Kuchimanchi