రాత్రి పన్నెండు గంటల తర్వాత గతంలో కొన్ని ఎంటర్ టెయిన్ మెంట్ చానళ్లు.. సెక్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెట్టేవి. ఆ ట్రెండ్ తర్వాత పోయింది. సెల్ ఫోన్లు చేతుల్లోకి వచ్చాక.. అలాంటి వాటిపై చూసేవాళ్లు కూడా ఆసక్తి కోల్పోయారు. కానీ ఓ న్యూస్ చానల్లో మాత్రం.. అర్థరాత్రి పావు గంట సేపు బ్లూఫిల్మ్ ప్రసారం అయింది. తెలంగాణలో మంచి ఆదరణ ఉన్న శాటిలైట్ చానల్ ఆఫీస్ బంజారాహిల్స్,జూబ్లిహిల్స్ మధ్యలో ఉంది. ఈ చానల్లో మూడు రోజుల కిందట అర్థరాత్రి అశ్లీల దృశ్యాలు టెలికాస్ట్ అయ్యాయి.
ఏకంగా పదిహేను నిమిషాల పాటు ఇవి వచ్చాయి. నిజానికి ఏ టీవీ చానల్లో ఒక్క నిమిషం బ్లాంక్ వస్తే హైరానా పడిపోతారు. అదే పదిహేను నిమిషాలు బ్లూ ఫిల్మ్ ప్రసారం అయిందంటే ఖచ్చితంగా ఎవరో కావాలని చేసిన పనే. ఆ చానల్లో పదకొండు గంటలకు లాస్ట్ బులెటిన్. పన్నెండు గంటలకు రిపీట్ బులెటిన్ ఉంటుంది. రిపీట్ బులెటిన్ వేయాల్సిన వ్యక్తి. బ్లూఫిల్మ్ పెట్టేశాడన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఓ చానల్ ఎయిర్ లోకి వెళ్లాలంటే ముందుగా సర్వర్లోకి ఆ ఫీడ్ ను ఎక్స్ పోర్ట్ చేయాలి. అలా చేసిన తర్వాతే ఆపరేటర్ ప్లే చేస్తాడు.
సర్వర్‌ను హ్యాక్ చేయడం అనేది సాధ్యం కాదు. కానీ ఇలా ప్రసారం చేశారన్న ఫిర్యాదులు పై స్థాయికి వెళ్తే కేసులవుతాయి కాబట్టి.. వెంటనే యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్వర్ హ్యాక్ చేశారని చెప్పింది. కానీ అంతర్గతంగా కొంత మంది ఉద్యోగులు ఇలా కుట్ర చేశారన్న అనుమానాలతో దర్యాప్తు చేయిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే చానల్ కావడంతో.. యాజమాన్యం చాలా సీరియస్‌గా ఉందని.. కొంత మందిపై చర్యలు తీసుకుందని చెబుతున్నారు. మొత్తానికి ఆ చానల్ ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయిపోయింది.