దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం ఎవరికైనా తెలుసా..? ఆ ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్న విషయంపై అంచనా ఉందా..? మీడియాలోనే కాదు..సోషల్ మీడియాలోనూ ఆ విషయం ఎందుకు బయటకు రావడం లేదు..?. ఎందుకో చెప్పడం.. పెద్ద పజిల్ ఏమీ కాదు. రైతుల ఆందోళల్ని మినిమైజ్ చేయడానికి కేంద్రం చేయాల్సిందంతా చేస్తోంది. అందులో భాగంగా.. కనిపించని కట్టడి అమలవుతోంది. అదే సమయంలో.. ఘనత వహించిన మీడియాకు ఇబ్బంది లేకుండా.. టీఆర్పీ రేసు కూడా పెట్టింది. అదే.. హీరోయిన్లపై డ్రగ్స్ కేసు ఆరోపణలు. సుశాంత్ ఆత్మహత్య కేసు పూర్తిగా డ్రగ్స్ కేసుగా మారిపోయిన సమయంలో..హీరోయిన్లు టార్గెట్ అయ్యారు. వరుసగా వారికి నోటీసులు పంపుతున్నారు.
దీపికా పదుకొనే లాంటి హీరోయిన్‌కు నోటీసులు ఇచ్చారు. ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆమె విచారణకు హాజరైనా విషయమే.. హాజరు కాకపోయినా రచ్చే.. మీడియా ఎజెండా ఇలా ఉంటుంది. అదే ప్రకారం కవరేజీ సాగుతుంది. రోజంతా అదే ఉంటుంది. అందులో సందేహం ఉండదు. ఇవాళ దీపిక.. రేపు సారా.. ఆ తర్వాత శ్రద్ధాకపూర్..రకుల్.. ఇలా వాటి సీరియల్ నడుస్తూనే ఉంటుంది. మీడియా టీఆర్పీల పంట పండించుకుటూనే ఉంటుంది. కానీ.. దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న రైతుల అజెండా మాత్రం.. ఎవరికీ కనిపించదు.. ఏ మీడియాలోనూ రాదు. చివరికి ఆ సెలబ్రిటీలు తప్పు చేసినట్లు ఆధారాలతో దొరికినా వారికి కూడా ఏమీ కాదు. కాకపోతే.. వారి ఇమేజ్ కొన్ని రోజులు .. రైతుల ఆందోళనలు కనిపించకుండా కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని కేంద్రం ఏ మాత్రం నివృతి చేయడం లేదు. కనీస మద్దతు ధర పెంచుతామని.. ఎరువుల సబ్సిడీని నేరుగా బ్యాంకులో వేస్తామని… తాయిలాలు ప్రకటిస్తోంది. కానీ.. తమ సాగు కార్పొరేట్ గుప్పిట్లోకి పోదు అనే భయాన్ని మాత్రం తీసేయడానికి ప్రభుత్వం సంకల్పించడం లేదు. ఇప్పటి వరకూ పంజాబ్, హర్యానాల్లో ఉద్ధృతంగా ఉన్న రైతు ఉద్యమం ఇప్పుడు… ఉత్తరాది రాష్ట్రాలన్నింటికీ పాకుతోంది. ఆ తర్వాత దక్షిణాదికి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇందులో మీడియా..సోషల్ మీడియా పాత్ర ఉండదు. కానీ రైతుల ఆవేదన ఉంటుంది.