ప్రత్యేకహౌదా నిరాకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాగ్రహంతో వున్నారని కొన్ని ఛానళ్లు పత్రికలు తెగ కథనాలు ఇచ్చాయి. ఒక పత్రికయితే రక్తం మరిగిపోతుందని ఆయన అన్నారని రాసింది. మన ఎంపిలు సరిగ్గా వ్యవహరించలేదని ఆయన మందలించారని కూడా రాసింది. మళ్లీ అదే పత్రికలో తెలుగుదేశం ఎంపిలు ప్రభుత్వంలో వున్నా నిశితంగా మాట్లాడి బిజెపిని ఇరుకునపెట్టారని పేర్లతో సహా ప్రశంసలు కురిపించింది. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు మీడియా గోష్టి గోని తర్వాత సీనియర్ నాయకులతో సమావేశం గాని ఆ ఛాయలేమీ లేకుండానే ముగిసిపోయాయి. ఛీత్కారాలు తిరస్కారాలు ఎన్ని ఎదురైనా రాయబారాలు పంపడమే గొప్ప మార్గమని అధినేత నిర్ణయం తీసుకున్నారు. తను స్వయంగా 30 సార్లు వెళితే మారని కేంద్రం తమ ఎంపిలు వెళ్లి ప్రధాని మోడీతో రెండు గంటలు మాట్లాడితే ఏదో ఒరిగిపోతుందని చెప్పడమే హాస్యాస్పదం. ఇచ్చిన మాట తప్పిన కేంద్రాన్నివదలి ప్రతిపక్షాలపై బాణాలు ఎక్కుపెట్టడం మరో విపరీతం.
ఈ విధంగా చంద్రబాబు కార్యాచరణకు తటపటాయిస్తుంటే పైన చెప్పుకున్న పత్రికలు ఛానళ్లు మాత్రం ఇప్పుడో అప్పుడో తెగతెంపులు అనే విధంగా కథలు వినిపించాయి. జూపూడి ప్రభాకరరావు, వైబీరాజేంద్రప్రసాద్, బుడ్డా వెంకన్న వంటి వారిని రంగంలోకి దింపి తీవ్ర విమర్శలు చేయించారు. వారి పాత్ర వారు బాగానే రక్తికట్టించారు గాని అధినాయకత్వమే రాజీ పడిన తర్వాత ఎంతగా నిప్పులు కక్కితే ఏం లాభం? ఇక్కడ సమస్య రక్తం మరిగినట్టు కథనం ఇచ్చిన పత్రిక గాని,బిజెపి టిడిపి తెగతెంపులు ఖాయమని కథనాలిచ్చిన ఛానల్ గాని కాస్తయినా ఆత్మ విమర్శ చేసుకుంటాయా? అంచనాలు తప్పాయని అంగీకరిస్తాయా? అయితే ఆ సూచనలేమీ లేవు. పైగా పార్లమెంటులో తెటుగుదేశం వీరోచిత పోరాటం చేస్తున్నట్టుగా వీటి కథనాలు కొనసాగుతున్నాయి. వైసీపీ సభ్యులు పోడియం ముందుకు పోయి నిరసన తెల్పుతున్నదాన్ని పెద్దగా చెప్పకుండా తమ స్థానాల్లో ప్లకార్డులుపట్టుకున్న టిడిపి సభ్యుల సంగతే పదే పదే స్క్రోలింగ్ లిస్తున్నాయి. ప్రత్యేక హౌదా కోసం శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పుడు అందరి సమస్యగా చూకుండా టిడిపి ్ ఒక్కటే ఏదో చేస్తుందని జోస్యాలు చెప్పడం అపహాస్యం పాలవుతుంటే పాఠాలేమీ నేర్చుకోరా పాత్రికేయ మిత్రులు?