ఓ వ్యక్తికి అన్యాయం జరిగిందని మరో వ్యక్తి రచ్చ రచ్చ చేస్తున్నారు. అది హై ప్రోఫైల్ కేసు. మరి అప్పుడు మీడియా ఏం చేయాలి..? ఎవరికైతే అన్యాయం జరిగిందో అతని దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో కనుక్కోవాలి..! కానీ వాళ్లే వచ్చి.. తమ వాదన వినిపిస్తామంటూ.. కొన్ని తెలుగు చానళ్లు వద్దే వద్దంటున్నాయి. తాము వినిపించుకోబోమంటున్నాయి. ఆ అన్యాయం అయిపోయారని … వారి తరపున గగ్గోలు పెడుతున్న వారి వాదనే వినిపిస్తామంటున్నారు. అంతే కాదు.. సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి.. రైతులకు జరిగిన అన్యాయంపై మాట్లాడిస్తున్నారు. ఇంతకీ వారు అన్యాయమైపోయారో లేదో వారే వచ్చి చెబుతామంటే పట్టించుకోవడం లేదు. వైసీపీకి మౌత్ పీసుల్లా మారిపోయిన రెండు చానళ్లు.. అమరావతి భూముల విషయంలో నిన్నటి నుంచి చేస్తున్న స్కిట్లు ఇవి.
అమరావతిలో దళిత రైతులకు అన్యాయం జరిగిందని .. వారికి న్యాయం చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి నెలకో కథతో తెర ముందుకు వస్తున్నారు. ఓ సారి సీఐడీకి ఫిర్యాదు చేస్తారు..మరోసారి రైతులు తాము భూములు అమ్ముకుంటున్న వీడియోలు బయట పెడతారు. అయితే అసలు భూముల యజమానులయిన రైతులు మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం తమను వాడుకుని .. తమను బద్నాం చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు. అయితే ప్రభుత్వం ఆళ్లది కాబట్టి.. ఆయనపై కేసులు పెట్టే ధైర్యం పోలీసులు చేయరు. రైతులు మాత్రం ఫిర్యాదులు చేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి బయట పెట్టిన దళిత రైతుల వీడియోల్లో ఉన్న రైతులందరూ.. మీడియా ముందుకు వచ్చారు.
తాము ఇష్టపూర్వకంగా అమ్ముకున్నామని.. మూడు లక్షలు వచ్చే భూమిని మూడు కోట్లకు అమ్ముకున్నామని.. ఇప్పుడు.. ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికే.. ఆళ్ల కొత్త గేమ్ ఆడుతున్నారని రైతులు అనుమానిస్తున్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చి సవాళ్లుచేస్తున్నారు. కానీ వైసీపీ వైపు నుంచి స్పందన ఉండటం లేదు. విచిత్రంగా.. వైసీపీ మద్దతు చానళ్లు మాత్రం.. ఆ వీడియోలు చూపించాయి.. ఆ రైతులు నేరుగా వచ్చి మాట్లడతామంటే మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఆ మీడియా ఇంతకు దిగజారిందా అని రైతులు బహిరంగంగానే తిట్టుకుంటున్నారు.