వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి జాతీయ స్థాయిలో హైలెట్ అయ్యారు. రేప్ చేసిన.. నలుగుర్ని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో… ప్రముఖుల విషయంలోనూ.. అలాంటి చర్య తీసుకోగలరా అన్న చర్చ దేశం మొత్తం ప్రారంభమమయింది. ఈ క్రమంలో మొదట మీడియా దృష్టి ప్రజాప్రతినిధులపై పడింది. ఎవరెవరిపై రేప్ కేసులున్నాయో బయటకు తీసింది. ఆశ్చర్యకరంగా.. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి.. గోరంట్ల మాధవ్ పేరు ఉంది. ఆయన పోలీసు శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ… రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీలో చేరి హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు.
పోలీసు అధికారిగా.. గోరంట్ల మాధవ్‌ది వివాదాస్పద చరిత్ర. ఓ కేసులో ఓ యువజంటను అదుపులోకి తీసుకున్న ఆయన.. ఆ జంటలోని మహిళతో.. అసభ్యంగా ప్రవర్తించారు. అత్యాచారం చేయబోయారని ఆ మహిళ కేసు పెట్టింది. ఆ కేసు విచారణలో ఉంది. అలాగే నోట్ల రద్దు సమయంలో.. ఓ సీనియర్ సిటీజన్ ను .. ఏటీఎం ముందు ఇష్టం వచ్చినట్లు బాదారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఘటనపైనా కేసు నమోదయింది. ఆ దాడి కేసు సంగతేమో కానీ.. ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన కేసు మాత్రం ఇప్పుడు తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో నలుగుర్ని ఎన్కౌంటర్ చేసినట్లుగా…రేప్ కేసులు ఉన్న ప్రజాప్రతినిధుల్ని కూడా ఎన్ కౌంటర్ చేస్తారా.. అని ప్రశ్నిస్తోంది. అందులో గోరంట్ల మాధవ్ పేరు కూడా ఉంది.
మామూలుగా అయితే.. తీవ్రమైన నేరాలున్న వారికి.. స్వచ్చంద పదవీ విరమణకు.. పోలీసు శాఖ అంగీకరించదు. వాటిపై విచారణ జరిగిన తర్వాత ఓ ప్రొసీజర్ ప్రకారం.. వెళ్లాల్సి ఉంటుంది. కానీ గోరంట్ల మాధవ్.. ఎన్నికల సమయంలో… కోర్టుకెళ్లారు. తన వీఆర్ఎస్ను ఆమోదించేలా ఆదేశించాలంటూ.. కోర్టుకు వెళ్లి.. అనుకూలమైన ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దాంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం అయింది. ఇప్పుడు.. ఆయనపై ఉన్న కేసులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.