ముఖ్యమంత్రిని ఇంటర్యూ చేయడం రాష్ట్ర స్థాయిలో ఏ జర్నలిస్టుకు అయినా ఓ కలే. ఒకప్పుడు అది సాధ్యమయింది. కానీ మోనార్క్లు అనుకునేవాళ్లు సీఎం అయిన తర్వాత అసాధ్యం అయింది. ఇప్పుడు మళ్లీ పాత పద్దతి వచ్చింది. తన పుట్టిన రోజు సందర్భంగా అడిగిన వారందరికీ రేవంత్ రెడ్డి ఇంటర్యూలు ఇచ్చారు. మాట్లాడారు. సెక్రటేరియట్ లోనూ ఆయనను జర్నలిస్టులు సులువుగా కలుసుకోగలరు. ఈ నైజం రేవంత్ రెడ్డిని జర్నలిస్టులకు మరింత దగ్గర చేస్తోంది.
చంద్రబాబు, వైఎస్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారు నేల మీదనే ఉండేవారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాతో మరింత సఖ్యతగా ఉండేవారు. మీడియా సంస్థలతో ఎలాంటి సమస్యలు ఉన్నా.. మీడియా ప్రతినిధులతో మాత్రం జోవియల్ గా ఉండేవారు. కనీసం వారంలో ఒక రోజు ప్రెస్మీట్లు పెట్టేవారు. ఓపికగా సమాధానాలిచ్చేవారు. అప్పటి రిపోర్టర్లకు సీఎంతో మాట్లాడటం.. ఇంటర్యూలు తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇటీవలి కాలం వరకూ సీఎంలకు అంటే కొండ మీద ఉంటారు. వారిని కలవడం అసాధ్యం అయిపోయింది.
అటు పదేళ్ల పాటు ఉన్న కేసీఆర్ అయినా.. ఇటు పదేళ్ల పాటు ఏపీలో ఉన్న జగన్ అయినా మీడియా ప్రతినిధుల్ని కలిసేవారు కాదు. వాళ్లతో వింత మాయా ప్రపంచం. ఏమైనా అంటే తెలంగాణలో కేటీఆర్… ఏపీలో సజ్జల మేము చెబితే సీఎం చెప్పినట్లే అంటూ వచ్చేస్తారు. కానీ సీఎంలు మాత్రం రారు. కేసీఆర్ మీడియా ప్రతినిధుల్ని సులువుగా ఎదుర్కోగలరు.. కానీ ఆయన … వాళ్లకు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటారు. జగన్ ..ఓ సాధారణ మీడియా ప్రతినిధి ప్రశ్నలను కూడా ఎదుర్కోలేరు. అందుకే రారు.ఈ పరిస్థితిని రేవంత్ మార్చేశారు. రిపోర్టర్లకు జాబ్ శాటిస్ ఫేక్షన్ కల్పిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మీడియా ప్రతినిధులకు సమాధానాలిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో ఇంటర్యూలూ ఇస్తారు. అందుకే మీడియా ఫ్రెండ్లీగా రేవంత్ రెడ్డి అని రిపోర్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.