నాలుగు రోజుల క్రితం.. ఎన్టీవీలో ఓ ప్రోమో ఎయిర్ అయింది. ఆ ప్రోమో సారాంశం… మరో టీవీ చానల్ ఓనర్ అయిన నాయుడు చరిత్ర అంతా బయటకు చెప్పడం. ఆ తర్వాత టీవీ5లో మరో ప్రోమో ఎయిర్ అయింది. దాని సారాంశం… మరో టీవీ చానల్ ఓనర్ అయిన చౌదరి గుట్టు రట్టు చేయడం. ఈ రెండు ప్రోమోలను చూసిన… చాలా మంది … ఇప్పటి వరకూ అందరిపై వార్తలు ప్రసారం చేస్తున్న చానళ్లు… వేర్వేరుగా అయినా తమ మీడియా పెద్దల గుట్టును బయట పెట్టబోతున్నాయని అనుకున్నారు. ప్రోమోల్లోనే ఒకరి ఘనతల్ని ఒకరు చెప్పుకున్నారు. అయితే ఆ కథనాలు ఎప్పటి నుంచి ప్రసారం చేస్తారన్నదానిపై ప్రోమోల్లోనే క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో అనే కమింగ్ అప్ ఇచ్చి సరిపెట్టారు.
సరే ఇవాళ కాకపోతే.. రేపైనా వస్తాయేమో అని చాలా మంది అనుకున్నారు కానీ… ఇప్పుడు అసలు ఆ ప్రోమోలే రావడం ఆగిపోయాయి. దాంతో టీవీ ప్రేక్షకులు ఇదేం… జర్నలిజం అనుకోవడం ప్రారంభించారు. బ్లాక్మెయిలింగ్ కోసం… మీడియా సంస్థలు ఇలా.. కొంత మందిపై ప్రోమోలు వేసి.. తర్వాత డీల్ కుదుర్చుకుని ఆపేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు.. స్వయంగా తమ మీద తాము ప్రోమోలు వేసుకుని మరీ .. చివరికి…రాజీ పడిపోయినట్లుగా కనిపిస్తోంది. బయటి వారిపై అమలు చేసే బ్లాక్మెయిలింగ్ ప్రోమోల వ్యూహం… సాటి మీడియా ఓనర్లపై పరస్పరం ప్రయోగించుకోవడంతోనే సమస్య వచ్చినట్లుగా కనిపిస్తోంది.
మొదట ప్రారంభించిన వారు… తాము ప్రోమో వేస్తే.. అవతలి చానల్ ఓనర్ కాళ్ల బేరానికి వస్తాడని ..అనుకున్నట్లుగా ఉన్నారు.. తన చేతిలో ఉన్నట్లుగానే.. అతని చేతిలో కూడా చానల్ ఉందని కాస్త విశాలంగా ఆలోచించలేకపోయారు. ఫలితంగా ఇప్పుడు వారు ప్రత్యేకంగా ఒకరిపై ఒకరు కథనాలు ప్రసారం చేసుకోకపోయినా.. .వారు వేసిన ప్రోమోలతోనే… వారు అక్రమాల గుట్టుముట్లన్నింటిపై కావాల్సినంతగా ఊహాగానాలు చేసుకోవడానికి చాన్సిచ్చిన వాళ్లయ్యారు. స్టోరీలు ఎయిర్ చేయనంత మాత్రాన.. వారు స్వచ్ఛంగా మిగిలే అవకాశం లేదు. వారిద్దరూ ఒకరిపై ఒకరు బురద చల్లేసుకున్నారు.