క్లీన్ ఇమేజ్ ఉన్న రాజమౌళి పై ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి తనని టార్చర్ పెడుతున్నాడని, అందుకే తాను చనిపోతున్నానని, దీన్ని సుమోటోగా స్వీకరించాలని శ్రీనివాసరావు అభ్యర్థిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తామిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించామని, స్నేహితుడిగా తన ప్రేమని త్యాగం చేశానని, ఆ విషయం ఇప్పుడు బయటకు ఎక్కడ చెబుతానో అని రాజమౌళి టార్చర్ పెడుతున్నాడని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
నిజానికి రాజమౌళి పై స్నేహితుడు చేసిన ఈ ఆరోపణలు సంచలనమైనవే. మీడియా వరకూ ఇదో హాట్ కేక్. సాధారణంగా ఇలాంటి వైరల్ విషయాల్ని మీడియా బాగా ఫోకస్లోకి తీసుకొస్తుంటుంది. అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానికి మీడియా, వెబ్ మీడియా.. ఏదైనా కావొచ్చు. ఫాలో అప్ స్టోరీలూ, వండి వార్చే కథనాలు.. ఇలా చాలా ఉంటాయి. కానీ రాజమౌళి విషయంలో ఇలాంటివేం జరగలేదు. కనీసం ప్రధాన పత్రికలు సైతం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. రాజమౌళిపై స్నేహితుడి ఆరోపణలు అనే హెడ్డింగ్ వార్త ప్రచురించే అవకాశం ఉన్నా, కనీసం దాని జోలికి కూడా పోలేదు. అంటే ఈ విషయాన్ని కనీసం రికార్డు చేయలేదన్నమాట. ప్రింట్ పక్కన పెడితే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎలాంటి హడావుడీ చేయలేదు. ఇది చాలా మామూలు విషయం అన్నట్టు వదిలేశారు.
రాజమౌళి వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. ఆర్భాటాలు అస్సలు పడవు. అలాంటి వ్యక్తిపై వచ్చిన ఆరోపణల్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని మరీ ప్రచురించాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. ఈసారి అదే చేసింది. శ్రీనివాసరావు తన సెల్ఫీ వీడియోలో కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు ప్రస్తావించారు. వాళ్లెవరూ ఈ విషయంపై స్పందించడానికి ఇష్టపడలేదు. కొంతమంది ‘అసలు శ్రీనివాసరావు ఎవరో తెలీదు’ అన్నట్టు కొట్టి పారేశారు. దాంతో.. మీడియా కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకొంది. రాజమౌళి స్థానంలో మరొకరెవరైనా ఉండి ఉంటే మాత్రం ఈ వెసులు బాటు దక్కేది కాదేమో?