అఖండ విజయానికి జనాదరణకు మారుపేరు ఎన్టీఆర్. 300 చిత్రాల మహానటుడు. అలాటి వ్యక్తి ఒకసారి రేడియోలోనూ దూరదర్శన్లోనూ మాట్లాడాలనుకుంటే కేంద్రం కాలడ్డం పెట్టింది. మామూలుగా వెళ్లి రికార్డు చేసుకువచ్చే బదులు ఆయనే స్టూడియోకు రావాలని పేచీ పెట్టి ఆ క్రమంలో ఆయన మాట్లాడాలనుకున్న సమయాన్ని పోగొట్టింది. దానిపై అప్పట్లో పెద్ద విమర్శలే వచ్చాయి. మరోసారి ప్రధాని విపిసింగ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించడానికి వస్తే దూరదర్శన్ అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని చూపించకుండానే ప్రసారాలు చేసింది. అయితే అది పొరబాటని అప్పటి సమాచార శాఖ మంత్రి ఉపేంద్ర ఖండించారు. అంతకంటే తీవ్రమైన చేదు అనుభవం ఇప్పుడు త్రిపుర ముఖ్యమంత్ర మాణిక్ సర్కార్‌కు ఎదురైంది. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ దేశంలోనే పేద సిఎంగా పేరొందిన మాణిక్‌సర్కార్ స్వాతంత్ర దినప్రసంగాన్ని సవరించుకోవాలని దూదర్శన్ అగర్తలా కేంద్రం షరతు పెట్టింది. దానికి ఆయన అంగీకరించకపోవడంతో అసలే ప్రసారం నిరాకరించింది. దేశంలో భావప్రకటనా స్వేచ్చపైన మీడియాపైన దాడి గురించి చెప్పుకుంటూనే వున్నాం.ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హక్కులకే రక్షణ లేని సెన్సారింగ్ వచ్చిపడింది. నోట్లరద్దు జిఎస్టి వంటివి ఇప్పటికే రాష్ట్రాలను నామకార్థంగా మార్చాయి. ఇక ఇలాటి ఏకపక్ష సెన్సారింగ్ కూడా వస్తే ఏమవుతుందో వూహించాల్సిందే.