సోషల్ మీడియా వచ్చిన తర్వాత వార్త వైరస్ కంటే వేగంగా వ్యాపించేస్తుంది. ఏదైనా సంఘటన జరిగితే చాలు.. పూర్తి వివరాలు తెలుసుకోకుండానే వార్తలు ఇచ్చేయడం అలావాటైపోయింది. ఇది ఎంత దారుణంగా తయారైయిందంటే .. కొంచెం ప్రామాణికత వున్న ఏ ఛానల్ లేదా న్యూస్ పేపర్.. ఓ చిన్న స్క్రోలింగ్ రాస్తే చాలు .. ఇంక అదే శాసనం అన్నట్టు వార్తలు వండేస్తున్నారు. నిన్న కీరవాణి వార్తే తీసుకోండి. ఒక వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ఆయన ఓ వీడియో చేశారు. దాన్ని చూసిన ఓ పేరున్న వార్త సంస్థ .. కీరవాణి ఆ వ్యాధితో బాధపడుతున్నారని రాసింది. సమాచారాన్ని అర్ధం చేసుకోవడంలోనే పప్పులో కాలేసింది ఆ వార్త సంస్థ. అయితే ఆ సంస్థ ఇస్తే నిజమే అయ్యింటుదని మిగతా చాలా ఛానల్స్, డిజిటల్ మీడియా పోర్టల్స్ ఆ తప్పుడు వార్తనే ఫాలో అయిపోయాయి.
నమ్రత విషయంలో కూడా ఇదే ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది. బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు ఓ కుదుపు కుదిపేస్తుంది. చాలా మందిపేర్లు బయటకి వచ్చాయి. కొన్ని అధికారులు చెప్పినవి .. ఇంకొన్ని మీడియా చెప్పినవి. నిన్న నమ్రత పేరు కూడా వచ్చేసింది. నేషనల్ వైడ్ గా ఓ పేరున్న ఓ ఛానల్ ఈ కేసులో ‘N’కూడా వుంది. N అంటే నమ్రత. ఆమె కూడా డ్రగ్స్ డీలర్స్ తో మాట్లడింది. దీనిపై అధికారులు సమాచారం వుంది అన్నట్లు ఓ వార్త ఇచ్చింది. ఈ లైన్ ని పట్టుకొని దాదాపు అన్ని తెలుగు ఛానల్స్ హడావిడి చేసేశాయి. ఎవరి దగ్గర పూర్తి సమాచారం లేదు. ఒకటే పాయింట్ .. డ్రగ్స్ కేసులో నమ్రత పేరు. అంతే. పాపం .. జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. సమాచారం మాత్రం లేదు. ఇదొక్కటే కాదు.. చాలా విషయాల్లో మీడియా పద్దతి ఇలానే వుంది. బురద చల్లేసి రిన్ షొప్ ఇచ్చే టైపులో మీడియా వ్యవహరించడం కొంతమంది మీడియాలో వుండే జనాలకే నచ్చడం లేదు.