ఉప ఎన్నికలు రావడం మీడియా చానల్స్ కి ప్రత్యేకమైన జోష్ తెచ్చిపెట్టింది. ఎన్నికలు, హాట్ హాట్ న్యూస్ లేని సమయాల్లో స్తబ్దు గా ఉండే వార్త ఛానెల్స్ తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పుణ్యమా అని బాగా యాక్టివ్ అయిపోయాయి. అయితే కొన్ని ప్రధాన ఛానల్స్ లో టిడిపిని పూర్తిగా సైడ్ చేసి- తిరుపతి లో పోటీ అంతా వైఎస్ఆర్సిపి బిజెపిల మధ్య ఉన్నట్టు చూపించే మైండ్ గేమ్ నడుస్తుందా అన్న అనుమానాలు ఆయా చానల్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు కలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి కి బిజెపికి మధ్య లోపాయికారిగా కాస్త అవగాహన ఉందనే అభిప్రాయం ప్రజల్లో మొదటినుండి ఉంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అంటూ చంద్రబాబు ని విమర్శించాడే తప్పించి ఏ నాడు కూడా మోడీని పల్లెత్తు మాట అనేవాడు కాదు. పైగా చంద్రబాబు నాయుడు ఎన్డియే కూటమి నుండి వైదొలిగిన తరువాత వైఎస్ఆర్సిపి బిజెపి ల మధ్య బంధం మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇక రాష్ట్ర బిజెపి నాయకత్వం పై కూడా -వారు అధికార వైఎస్ఆర్సిపి పార్టీ కి దగ్గరగా ఉంటారు అన్న విమర్శ మొదటి నుండి ఉంది.
ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక వచ్చింది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో ఇక ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల అభ్యర్థులు న్యూస్ ఛానల్స్ వేదికగా ఒక రేంజ్ లో తమ వాణిని వినిపిస్తున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా వార్తా చానల్స్ ఫాలో అవుతున్న వారికి, తిరుపతి ఉప ఎన్నిక కేవలం వైఎస్ఆర్సిపి బిజెపిల మధ్య మాత్రమే ఉందన్న అభిప్రాయాన్ని కలిగించడానికి కొన్ని ప్రధాన ఛానెల్స్ శాయశక్తులా కృషి చేస్తున్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఉదాహరణకి ఒక ప్రధాన ఛానల్ లో వై ఎస్ ఆర్ సి పి ప్రచార గీతానికి బిజెపి ప్రచార గీతానికి మధ్య ఉన్న పోలికను హైలెట్ చేస్తూ, రెండు పార్టీల వారు ఒకే జానపద గీతాన్ని కాపీ కొట్టారు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ఏ పార్టీ వారు ఏ పార్టీ పాట ని కాపీ కొట్టారు అన్న అంశంపై చిన్న బులెటిన్ వచ్చింది. మా పాట ని బిజెపి వారు కాపీ కొట్టడం పట్ల మాకేమీ అభ్యంతరం లేదని, మా పాట నే కాదు మా పథకాలను కూడా కాపీ కొట్టే పరిస్థితి బిజెపికి ఏర్పడుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే, మోడీని ప్రపంచదేశాలు కాపీ కొడుతున్నాయని, కేంద్ర పథకాలకే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటోందని బిజెపి నేతలు కౌంటర్ ఇచ్చారు.
ఇవే కాకుండా వీలైనంతవరకు వార్త బులిటెన్ లు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రత్యర్థి బిజెపి పార్టీ యే అని చూపించే విధంగా ప్రోగ్రాం డిజైనింగ్ చేసినట్లు సునిశితంగా పరిశీలించే ప్రేక్షకులకు అర్థం అవుతోంది. విజయ సాయి రెడ్డికి సోము వీర్రాజు కి మధ్య జరిగే ట్విట్టర్ యుద్దానికి చానల్స్ అన్నీ కూడా బోలెడంత ప్రచారాన్ని కల్పించడం కూడా ఇదే కోవలోకి వస్తుందని అర్థం అవుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజేతగా నిలువగా రెండో స్థానంలో టిడిపి అభ్యర్థి నిలిస్తే, బిజెపి జనసేన అభ్యర్థులు ఇద్దరు కలిసి కూడా 10 శాతం ఓట్లు సాధించలేక పోయిన సంగతి తెలిసిందే. అయితే ఉప ఎన్నిక సందర్భంగా టిడిపిని మూడో స్థానానికి పరిమితం చేయడానికి రాష్ట్ర అధికార పార్టీ మరియు కేంద్ర అధికార పార్టీ కలిపి కుట్ర పన్నాయనే అభిప్రాయం ప్రస్తుతం టిడిపి అభిమానుల లో బలంగా ఉంది. దాదాపు అన్ని చానల్స్ లో కూడా, 2019లో నోటా తో పోటీపడ్డ బిజెపికి, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, వ్యూహాత్మకంగా పనబాక లక్ష్మి బలహీనమైన అభ్యర్థి అన్న భావం ప్రేక్షకుల మైండ్ లో ఫీడ్ అయ్యేలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారని టిడిపి అభిమానులు మండిపడుతున్నారు.
మరి మీడియా సాక్షిగా జరుగుతున్న ఈ మైండ్ గేమ్ వైఎస్ఆర్సిపి బిజెపి లను మొదటి రెండు స్థానాలలో ఉంచి టిడిపిని మూడో స్థానానికి పరిమితం చేయడంలో సఫలీకృతం అవుతుందా, లేక దశాబ్దాలుగా తమ వెన్నంటి ఉన్న క్యాడర్ సహాయంతో టిడిపి తన పట్టు నిలబెట్టుకుంటుందా అన్నది వేచి చూడాలి.