‘ఫించెన్లు ఇస్తున్నది నేను, రోడ్లు వేయించి నేను, రుణమాఫీ ఇచ్చింది నేను, రేషన్లు అందిస్తున్నది నేను…’ ఇలా చెబుతూ తనకే ఓటు వెయ్యాలంటూ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిన అంశం రాజకీయంగా చర్చనీయమైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడాన్ని చాలామంది తప్పుబట్టారు. ఇక, విపక్షం వైకాపా స్పందన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రజల కోసం తన సొంత సొమ్ము తీసి ఖర్చు చేస్తున్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించింది. అయితే, ఈ విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కార్యకర్తలతో తాను చెప్పిన మాటల్ని మీడియాలో ఓ వర్గం వక్రీకరించిందని అన్నారు!
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యే చెప్పాలని కార్యకర్తలకు సూచించాననీ, కానీ మీడియాలో ఒక వర్గం తన అభిప్రాయాన్ని వక్రీకరించిందని చంద్రబాబు చెప్పారు. పని చేస్తున్నవారికే ఓటు వెయ్యాలన్నదే తన మాటలకు అర్థమనీ, అయోగ్యుల చేతులో రాష్ట్రాన్ని పెట్టొద్దని విజ్ఞప్తి చేయడమే తన మాటల్లో అంతరార్థం అని సీఎం విడమరచి చెప్పారు. చేతగాని వారి చేతుల్లో అధికారం పడితే, అభివృద్ధి తలకిందులౌతుందనీ, డబ్బు కోసం ఆశపడి ఓట్లు వెయ్యొద్దనే చెప్పానంటూ చంద్రబాబు అన్నారు. మీడియాలో ఒక వర్గం తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందంటూ ఆ వర్గానికి క్లాస్ తీసుకున్నారు.
రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా అభివృద్ధి చేస్తున్నామనీ, సంక్షేమ పథకాలను ఖర్చుకు వెరవకుండా అమలు చేస్తున్న విషయాన్ని మీడియా గుర్తించాలని చంద్రబాబు చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే మీడియా అండగా ఉండాల్సింది పోయి… ఒక వర్గం తమ ప్రయోజనాల కోసం వక్రీకరణకు పాల్పడుతోందని ఆరోపించారు. మంచి చేసే ప్రభుత్వాలకు అండగా నిలవాలనీ, ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తే మరింత మంచి జరుగుతుందనే విషయాన్ని మీడియాలో ఆ వర్గం గుర్తించాలని చంద్రబాబు కోరారు.
విచిత్రం ఏంటంటే… తన వ్యాఖ్యలు వివాదం అయ్యేసరికి చంద్రబాబు ఇలా గొంతు సవరించుకున్నారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా మీడియా వక్రీకరణ అనేశారు. అయితే, చంద్రబాబు విజయాల్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు! నిజానికి, ఏపీలో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్న మీడియా వర్గం ఏపాటిదో ప్రజలకు తెలుసు. తెల్లారిన దగ్గర్నుంచీ వారు ఊదుతున్న బాకాలు ప్రజలు వింటున్నారు! అయినాసరే, ఇంకా ఏదో చాలడం లేదన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయినా, మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అప్పుడే వాస్తవాలు పాలకులకు అర్థమౌతాయి. అధికార పార్టీ విజయాలు అంటే పథకాల ద్వారా ప్రయోజనాల రూపంలో ప్రజలకు చేరతాయి కదా. వాటికి ప్రచారం కల్పించాల్సిన పనేముంది..?