తెలుగు మీడియా ఛానల్స్ ఎప్పుడు ఎలాంటి కథనాలు ప్రసారం చేస్తాయి అన్నది ప్రేక్షకులకు పెద్ద పజిల్ గా మారింది. మొన్నటి వరకు షర్మిల రాజకీయ పార్టీ ని ఆకాశానికి ఎత్తేసి, నిరంతర కవరేజ్ ఇచ్చిన చానల్స్ ఇప్పుడు హఠాత్తు గా ప్లేటు ఫిరాయించి ఆ పార్టీ పై నెగటివ్ కథనాల ను పుంఖాను పుంఖాలు గా ప్రసారం చేస్తున్నాయి. దీని వెనుక మతలబు ఏంటి అన్నది మాత్రం సగటు ప్రేక్షకుల కు అర్థం కావడం లేదు. అదే సమయంలో దీని వెనుక మతలబు గురించి కొన్ని రకాల రూమర్స్ మీడియా వర్గాలలో, రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
Click here:షర్మిల పార్టీ కొన్ని చానల్స్ కి కల్పవృక్షం గా మారిందా?
పార్టీ పెట్టిన కొత్తలో షర్మిల పార్టీ , కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానల్స్ కి కల్పవృక్షం గా మారింది అంటూ కొన్ని గుస గుసలు వినిపించాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి బిజెపి కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల ను తలద న్నిన తీన్మార్ మల్లన్న వంటి వారి పై నాలుగు లైన్ల స్క్రోలింగ్ కూడా వేయని అనేక చానల్స్ షర్మిల పార్టీ వచ్చిన కొత్త లో ఆ పార్టీకి కవరేజ్ ఇచ్చే విషయంలో మాత్రం తెగ హడావుడి చేశాయి. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ఒక కవాతు చేస్తే దానికి సుమారు ఐదు లక్షల మంది దాకా జనం హాజరు అయితే దాని మీద ఒక్క లైన్ స్క్రోలింగ్ కూడా వేయని పార్టీలు, షర్మిల పార్టీ విషయంలో మాత్రం, పార్టీ లాంచ్ కి ముందు రోజు , పార్టీ ఆవిర్భావ రోజు, ఆ తర్వాత రోజు విపరీతమైన కవరేజ్ ఇచ్చాయి. షర్మిల పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న టాపిక్ మీద మీద ఎక్కువమంది వీక్షించే ప్రైమ్ టైం లో తెగ డిబేట్ లు పెట్టాయి. ఆవిడ బయటకు వచ్చి చేసే రాజకీయ కార్యక్రమాల పైనే కాకుండా, ట్విట్టర్ లో చేసే వ్యాఖ్యల పై కూడా ప్రైమ్ టైం లో కథనాలు ప్రసారం చేశాయి. తమ కు ఆ పార్టీ మీద పెద్దగా ఆసక్తి లేక పోయినప్పటికీ, ఎందుకు చానల్స్ ఇంతగా షర్మిల పార్టీని మోస్తున్నాయి అన్నది సగటు తెలంగాణ ప్రేక్షకులకు మాత్రం అర్థం కాలేదు. కానీ, షర్మిల పార్టీ కొన్ని చానల్స్ కు కల్ప వృక్షం గా మారిందని, అందుకే ఆ చానల్స్ పార్టీ పెట్టిన కొత్తలో అటువంటి కథనాలు ప్రసారం చేశాయని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
కట్ చేస్తే:
కట్ చేస్తే, అప్పట్లో పొగడ్తల్లో ముంచెత్తిన ఛానల్స్ లో చాలా వరకు ఇప్పుడు షర్మిల పై, ఆవిడ పార్టీ పై వరుస పెట్టి నెగటివ్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. గురి తప్పిన బాణం అని, అసలు గురే లేని బాణం అని రక రకాలుగా విమర్శిస్తూ, రాజకీయ వ్యూహాలు రచించడం లో షర్మిల పూర్తిగా విఫలం అయ్యారని ఇప్పుడు ఆ చానల్స్ వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే షర్మిల పార్టీ పెట్టిన కొత్తలో తెలంగాణ ప్రజలకు ఆవిడ పార్టీ పై ఏ మాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ ఆవిడ గురించి పాజిటివ్ కథనాలను రంగరించి తమ మీదకు వదిలిన ఆ యా చానెల్స్, ఇప్పుడు పని గట్టుకుని ఎందుకు నెగిటివ్ కథనాలు వండి వారుస్తున్నాయి అన్నది సగటు ప్రేక్షకుడి కి మళ్లీ అర్థం కావడం లేదు. అయితే అప్పట్లో షర్మిల పార్టీ కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కి కల్పవృక్షంగా మారింది అని గుసగుసలు వినిపించిన వారు మాత్రం – బహుశా ఆ కల్ప వృక్షం ఇప్పుడు మోడు బోయి ఉంటుందని, ఆ చానల్స్ కు షర్మిల పార్టీ నుండి మొదట్లో వచ్చినంత “స్పందన”, తర్వాతి రోజులలో రాకపోయి ఉండవచ్చు అని, ఇటీవలి కాలంలో షర్మిల పార్టీ తరపు నుండి ఆయా చానల్స్ కి ఊహించినంత “స్పందన” రాకపోయి ఉంటుందని, అందుకే ఆ చానల్స్ ప్లేటు ఫిరాయించి ఉంటాయని, కొత్తరకం గుసగుసలు వినిపిస్తున్నారు.
మరి వీటిలో ఎంత వరకు నిజం అన్నది వేచి చూడాలి.