వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. ఎంతో హడావుడి చేసి చేపట్టిన.. తాత్కాలిక సచివాలయ ముచ్చట మూడు నాళ్లే అవుతోంది. రాజధానిని హైదరాబాద్ నుంచి ఏపీలోకి తరలించామని ఏపీ ప్రభుత్వం చాలా గొప్పలే చెప్పుకున్నా.. చెప్పుకుంటున్నా.. అసలు పరిస్థితి మాత్రం వేరే రకంగా ఉంది. అనేక మంది సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెలగపూడికి రావడం, ఇక్కడ పరిస్థితులు, సౌకర్యాలు సరిగా లేవని రెండు మూడు రోజుల్లోనే తిరిగి హైదరాబాద్ కు తిరుగుబాట పట్టడం.. రొటీన్ అయిపోయింది! తాజాగా ఆర్ అండ్ బీ శాఖ అధికారులు వెలగపూడి లో మూడు రోజుల పాటు పని చేసి, తాము అక్కడ పని చేయలేమని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
ఏదో ఒకరిద్దరు కాదు.. ఏకంగా 45 మంది వచ్చిన ప్రత్యేక బస్సులోనే తిరుగు ప్రయాణం అయ్యారు. అదేమంటే.. ఇక్కడ ఆఫీసుల్లో కనీసం టాయ్ లెట్ సౌకర్యం కూడా లేదని వారు చెబుతున్నారు. ఇలాంటి చోట పని చేయడం ఎలా కుదురుతుంది ? అనేసి వారు తిరిగి హైదరాబాద్ లోని ఏపీ సెక్రటేరియట్ కు చేరుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అనుకూల మీడియా నేమో..హైదరాబాద్ నుంచి వెలగపూడికి బయలు దేరిన ఉద్యోగుల లెక్కలు చెబుతాయి.. వారి గురించి హైలెట్ చేసి చూపుతాయి. అయితే అసౌకర్యాల నడుమ పనిచేయలేమంటూ హైదరాబాద్ తిరిగి వస్తున్న వారిపై మాత్రం ఈ వర్గాలు ఏ మాత్రం స్పందిచడం లేదు! హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు వెలగపూడికి తరలి రావడం గురించి చెప్పమంటే.. చాలానే చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశామని కూడా ప్రకటించుకున్నారు. ఈ నిర్మాణంలో ఫ్లోర్ కు ఒకసారి, రూమ్ కు మరోసారి ఓపెనింగ్స్, రిబ్బన్ కటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే అక్కడకు వెళ్లిన ఉద్యోగులు మాత్రం తిరుగుటపాలో వెనక్కువస్తున్నారు. మరి వారికి సరైన స్థాయి ఏర్పాట్లు చేయనైనా చేయాలి లేదా, ఉన్న సౌకర్యాల మధ్యనే వారిని పని చేయించనైనా చేయగలగాలి. అయితే ఈ రెండింటికీ కాకుండా వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం!