సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ‘జస్టిస్ ఫర్ దిషా’ హత్య కేసు విషయంలో ప్రజల నుండి తీవ్రమైన స్పందన వస్తోంది. నిందితులను తక్షణమే శిక్షించాలంటూ ప్రజల నుండి తీవ్రమైన నిరసనలు వస్తున్నాయి. పోలీసులు కూడా 24 గంటల్లో కేసును ఛేదించారు. ఇక మీడియాలో కూడా నిందితుల తీరుని గర్హిస్తూ వరుస కథనాలు వెలువడ్డాయి. అయితే, హైదరాబాదులో మహిళల శాంతిభద్రతలు ఎంతవరకు పదిలం అన్న అనుమానాలు ప్రజలలో కలిగేలా చేసిన ఈ సంఘటన విషయంలో మీడియా కథనాలు తెలంగాణ ప్రభుత్వానికి కొంత కూడా నొప్పి కలిగించని రీతిలో డిజైన్ చేయబడడం విశ్లేషకుల లో తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తోంది.
100 డయల్ చేస్తే పోలీసులు ఎలా ప్రతిస్పందిస్తారో అగ్ర ఛానల్ లో కథనం:
తెలుగులోని అగ్ర ఛానల్, ప్రజలు 100 కి డయలు చేస్తే పోలీసులు మూడు నిమిషాల్లోనే స్పందిస్తున్నారు అంటూ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనంలో ఆ చానల్ ఉద్యోగిని ఒకరు 100 కి డయల్ చేస్తే పోలీసులు 3 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నట్లుగా చూపించారు. ఈ కథనం అన్యాపదేశంగా ఏం చెబుతుంది అంటే, మృతి చెందిన ‘జస్టిస్ ఫర్ దిషా’ 100 కి డయల్ చేయకపోవడం వల్లే చనిపోయింది అంటూ ప్రజల మస్తిష్కాలలోకి ఎక్కిస్తూ, బాధితురాలిదే తప్పన్నట్టుగా అన్యాపదేశంగా చిత్రీకరిస్తోంది.
కంప్లైంట్ తీసుకోకుండా ఠాణా నుండి మరొక ఠాణా కి మధ్య రాత్రి కుటుంబ సభ్యులను తిప్పిన పోలీసులు:
స్వయానా బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయబోతే, ఇది మా పరిధిలోది కాదంటే మా పరిధిలోకి కాదంటూ పోలీసులు ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్ కు మధ్యరాత్రి ఆ కుటుంబ సభ్యులను తిప్పిన అంశాన్ని మరుగు పరుస్తూ, 100 కి డయల్ చేయకపోవడం వల్లే ఈ ఘాతుకం జరిగింది అన్నట్లుగా మీడియా ప్రొజెక్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో సదరు మీడియా సంస్థలు మరొకసారి ఆలోచించుకోవాలి. కంప్లైంట్ తీసుకోకుండా బాధితురాలి కుటుంబ సభ్యులను మధ్యరాత్రి వేధించిన పోలీసుల మీద ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుందో ప్రశ్నించడానికి ఒక్క తెలుగు ఛానల్ కి కూడా ఎందుకు మనసు రాలేదో, ఇప్పుడు పెద్ద పెద్ద నీతులు చెబుతున్న మీడియా సంస్థలు ఆత్మావలోకనం చేసుకోవాలి. అటువంటి సమయంలో సరైన రీతిలో స్పందించని పోలీసుల మీద గట్టి చర్యలు తీసుకుంటేనే, రేపు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు తగిన రీతిలో స్పందిస్తారు.
ప్రభుత్వాన్ని అడగవలసిన ప్రశ్నలు మరెన్నో ఉన్నా, అడిగే ధైర్యం లేని తెలుగు మీడియా:
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎంపీని జాతీయ మీడియా లో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రశ్నలేవీ ఏ తెలుగు మీడియా కూడా, ఏ ఒక్క అధికార పార్టీ నేత ని ఎందుకు ప్రశ్నించలేక పోయింది అనే అనుమానాలు ఆ వీడియో చూసిన ప్రేక్షకులకు కలుగక మానవు. బాధితురాలిదే తప్పన్నట్టుగా మాట్లాడిన తెలంగాణ హోంమంత్రి వ్యాఖ్యలను చీల్చిచెండాడే ధైర్యం ఒక్క తెలుగు మీడియా కూడా చేయలేక పోవడం మన దురదృష్టం.
మీడియా అడగని మరొక ప్రశ్న ఏమిటంటే – అవుటర్ రింగ్ రోడ్డు లో పోలీసుల పెట్రోలింగ్ ఏ మేరకు జరుగుతోంది అని. ఆ పెట్రోలింగే గనక సరిగ్గా జరిగి ఉంటే ‘జస్టిస్ ఫర్ దిషా’ ప్రాణాలను కాపాడగలిగి ఉండేవారమని ఒక్క తెలుగు ఛానల్ కూడా ఎందుకు చెప్పలేకపోతోంది.
ప్రభుత్వాన్ని అడగవలసిన ప్రశ్నలు అడగటం మానేసి, ఈ సమయంలో కూడా ప్రభుత్వానికి నొప్పి కలిగించని రీతిలో తెలుగు మీడియా ప్రవర్తించడం దురదృష్టకరం. ఈ సంఘటన ఏ నాలుగు గోడల మధ్యో జరిగి ఉంటే అది వేరు కానీ, దాని మీద ప్రయాణించడానికి కూడా ప్రజలతో టోల్ గేట్స్ పెట్టి డబ్బులు వసూలు చేసే అవుటర్ రింగ్ రోడ్డు మీద, రాత్రి 9:30 గంటలకు ( మధ్య రాత్రి కూడా కాదు) ఇటువంటి హేయమైన సంఘటన జరిగితే, ఇందులో ప్రభుత్వానిది ఏ బాధ్యత లేదని, ప్రభుత్వ శాఖలన్నీ అద్భుతంగానే పనిచేస్తున్నాయని, మృతురాలి పొరపాటు వల్ల, లేదంటే కామాంధుల వల్ల మాత్రమే ఈ సంఘటన జరిగిందని, ప్రభుత్వానికి ఇందులో ఏ మాత్రం బాధ్యత లేదని అన్యాపదేశంగా ప్రజల మస్తిష్కాలలోకి ఎక్కిస్తూ చేస్తున్న కథనాలు సమాజాన్ని ఏమాత్రం మెరుగుపరచవని తెలుగు మీడియా ఎప్పటికీ గుర్తిస్తుందో!!
– జురాన్ (@ CriticZuran)