జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారానికి కారణమయ్యాయో తెలిసిందే. శ్రీరెడ్డి బూతులు మాట్లాడుతుంటే వాటిని యథాతథంగా టీవీ 9తో సహా కొన్ని ఛానెల్స్ ప్రసారం చేయడాన్ని పవన్ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. మీడియాలో ఒక వర్గంతోపాటు కొంతమంది తనపై కుట్ర చేస్తున్నారనీ, ఈ క్రమంలో తన తల్లిపై దుష్ప్రచారం చేస్తున్నారని పవన్ ఆరోపించడం, నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో మెగా ఫ్యామిలీ హడావుడి, ఇవాళ్ల టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్ లు జరిగాయి. అయితే, పవన్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏయే ఛానెల్స్ ఎలా ప్రసారం చేశాయనేది జర్నలిస్ట్ యూనియన్ పరిశీలించింది.
దీన్లో తేలిన వాస్తవం ఏంటంటే… పవన్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి విమర్శలను ప్రసారం చేస్తున్న సమయంలో, ‘మా*#..’ అనే తిట్టుపై బీప్ సౌండ్ వేశారు. శ్రీరెడ్డి వ్యాఖ్యల్ని ప్రసారం చేసిన తెలుగు ఛానెల్స్ అన్నీ బీప్ సౌండ్ వేసే ప్రసారం చేశాయని జర్నలిస్టుల సంఘం అంటోంది. సదరు వ్యాఖ్యలకు సంబంధించి తెలుగు ఛానెల్స్ ప్రసారం చేసిన వార్తలను వారు పరిశీలించారు. ‘నేను ఒక మదర్ ని ఏమీ అనాలని అనుకోవడం లేదు. పవన్ కల్యాణ్… నీకు అమ్మాయిల జాతి మీద విలువుందా..? నువ్వేం మాట్లాడుతున్నావ్.. పోలీస్ స్టేషన్ కి వెళ్లాలి. నువ్వు చెప్పాలి నాకు సలహా! పవన్ కల్యాణ్ అన్న అన్నాను కదా. (చెప్పుతో కొట్టుకుంటూ) పవన్ ని ఏ అమ్మాయీ అన్న అనదు. పవన్ కల్యాణ్ మా..((బీప్))..’ అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. టీవీ9 ప్రసారం చేసిన ఫుటేజ్ లో ఉన్నది ఇదే! ఆ ‘మా’టను ఎడిట్ చేయకుండా ఎవ్వరూ ప్రసారం చేయలేదనీ, ఆ ఘటనను లైవ్ కూడా ఇవ్వలేదని జర్నలిస్ట్ సంఘం తేల్చింది.
మరి, శ్రీరెడ్డి వ్యాఖ్యల్ని బీప్ సౌండ్ వేసి మరీ ప్రసారం చేసినప్పుడు… మీడియాపై పవన్ ఎందుకు ఆవేశపడ్డినట్టు…? ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కాని వీడియో ఫుటేజ్ తీసుకుని, దాన్ని పట్టుకుని తననూ తన తల్లినీ అవమానించాయీ అంటూ ఎందుకు మీడియాపై రచ్చ చేస్తున్నట్టు..? ఏ మీడియా సంస్థ అయినా.. ఒక ఘటనను కవర్ చేసినప్పుడు, దాన్ని ప్రసారం చేసేముందు ఎడిటింగ్ చేస్తుంది. అభ్యంతరకమైన వ్యాఖ్యలు, దృశ్యాలుంటే వాటిని వినిపించకుండా, కనిపించకుండా జాగ్రత్తపడ్డాకనే ప్రసారం చేస్తుంది. పవన్ విషయంలో శ్రీరెడ్డి ఎన్ని మాట్లాడినా, మీడియా ఆ పనే చేసింది. అది తెలుసుకోకుండా… సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అన్ ఎడిటెడ్ ఫుటేజ్ తీసుకుని, ఇది ఫలానా ఛానెళ్ల దుష్ప్రచారమే అని దుమ్మెత్తి పోస్తే ఎలా..?