జర్నలిజం పాఠాలన్నీ కూడా ప్రజల కోసమే పనిచేయమని చెప్తూ ఉంటాయి. ప్రజల కోసం పని చేస్తామని చెప్పే మీడియా సంస్థలు, జర్నలిస్టులు ప్రభుత్వ స్థలాలను, ఇంటిస్థలాలను…ఇంకా కోట్లాది రూపాయల రాయితీలను పొందుతూ ఉంటారు. ఇక ప్రభుత్వ ప్రకటనలపైనే ఆధారపడి బ్రతుకుతున్న మీడియా సంస్థలు ఎన్నో. ఈ సొమ్మంతా కూడా ప్రజలదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ప్రజల నుంచి కోట్లాది రూపాయల సొమ్మును రాయితీలుగా పొందుతున్న మీడియా సంస్థలు నిజంగా ఆ ప్రజల కోసం పనిచేస్తున్నాయా? తెలుగు నాట మాత్రం ఎక్కువ మీడియా సంస్థలు స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయన్నది నిజం. ఇంతకు ముందు వరకూ రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో మాత్రమే వార్తల వక్రీకరణలు కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు దిగజారిపోయాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే రాజకీయ నాయకులకు, మీడియాకూ తేడా లేకుండా పోయింది. జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు చనిపోతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం కూడా కేవలం జేసీ బ్రదర్స్‌కి అనుకూలంగా ఉండే వాయిస్ మాత్రమే వినిపించింది. టిడిపి నాయకులు కూడా అదే పాట పాడారు. ఇప్పుడు సీనియర్ నాయకుడు భూమా నాగిరెడ్డి మరణం విషయంలో కూడా రాజకీయ నాయకులకంటే ఎక్కువగా శవ రాజకీయానికి పాల్పడుతోంది మీడియా.
టిడిపి అనుకూల మీడియా మొత్తం కూడా ఒత్తిడి, ఫ్రస్ట్టేషన్ వళ్ళే భూమా నాగిరెడ్డి చనిపోయాడన్న డాక్లర్ల మాటలు ఎక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తాయో అని చెప్పి ఆందోళన చెందింది. అందుకే భూమా నాగిరెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ అయిన మరుక్షణం నుంచి భూమా కోసం చంద్రబాబు, లోకేష్‌లు పడుతున్న తాపత్రయం అంటూ తోచిన వార్తలను రాసేసింది. అంతకుముందు రోజు సాయంత్రం చంద్రబాబు-భూమా నాగిరెడ్డిల ఆంతరంగిక సమావేశంలో చర్చించిన విషయాలు అని చెప్తూ చంద్రబాబుకు అనుకూలంగా ఉండేలా ఇష్టారీతిన అచ్చోసి వదిలారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు భజన అంటేనే చొక్కాలు చించుకునే రేంజ్లో రెచ్చిపోయే ఓపెన్ హార్ట్ సర్జన్ పత్రిక అయితే టిడిపి ఎమ్మెల్సీని గెలిపించడమే భూమా ఆత్మకు శాంతి అనే రేంజ్లో వార్తలు రాసేసింది. ఎమ్మెల్సీని గెలిపిస్తానని చెప్పి చంద్రబాబు దగ్గర భూమానాగిరెడ్డి శపథం చేశాడని, అదే ఆయన చివరి కోరిక అనే రేంజ్లో వార్తలు వండివార్చింది. ఇక భూమా ఆరోగ్యం గురించి చంద్రబాబు ఆరాతీయడం, భూమాకు జాగ్రత్తలు చెప్పడం, రాజకీయాలదేముంది…ముందు ఆరోగ్యం జాగ్రత్త అని చంద్రబాబు అనడం..లాంటి తాళింపుల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఈ విషయంలో తెలుగు వాళ్ళ నంబర్ ఒన్ పత్రిక కూడా తన ప్రయత్నం తాను చేసింది. మొత్తంగా వైసిపి తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచీ భూమాపైన ఎస్సీ ఎస్టీ కేసు బనాయించడం, అష్టకష్టాలు పెట్టడంలాంటి విషయాలన్నీ దాచేసింది. పార్టీ మారుతున్న సందర్భంలో కూడా భూమా నాగిరెడ్డి ఆ విషయాలను ప్రముఖంగా చెప్పడం గమనార్హం. ఇక మంత్రి పదవి విషయంలో భూమా ఎంతగా ఆశపడ్డాడో రాజకీయ నాయకులందరికీ తెలుసు. మీడియా వాళ్ళకు కూడా తెలుసు. సంవత్సరం నుంచీ ఊరిస్తూ వస్తున్న మంత్రి పదవి కోసం భూమా నాగిరెడ్డి అస్సలు ఆందోళన చెందలేదంటే నమ్మగలమా? అలాగే తరాల తరబడి బద్ధ శతృవులుగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన పరిస్థితి వస్తే ఆందోళన లేకుండా ఉంటుందా?
ఇక టిడిపి అనుకూల మీడియా సంస్థలు రాసిన వార్తలకు పూర్తి వ్యతిరేకంగా జగన్ అనుకూల మీడియా రాసేసింది. మరణానికి ముందు రోజు రాత్రి భూమానాగిరెడ్డికి, చంద్రబాబుకు మధ్య వాదోపవాదాలు జరిగాయని రాసేసింది. తన కూతురు అఖిల ప్రియకు అయినా మంత్రి పదవి ఇవ్వాలని భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తేనే మంత్రి పదవి అని మడతబేరం పెట్టాడని రాసుకొచ్చింది. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోవడంతో భూమా నాగిరెడ్డి చాలా ఆందోళన చెందాడని రాసుకొచ్చింది. మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి పార్టీలో చేర్చుకుని సంవత్సరం నుంచీ వెయిట్ చేయిస్తున్నారని భూమా నాగిరెడ్డి ఆందోళన చెందారట. ఇప్పటికైనా ఇస్తారు అని అనుకుంటే ఎమ్మెల్సీ గెలుపుతో ముడిపెట్టడం, అలాగే గవర్నర్ వద్దంటున్నారని టిడిపి అనుకూల మీడియాలో రాయించడంతో భూమా నాగిరెడ్డి ఆందోళన చెందారని రాసుకొచ్చారు.
ఓవరాల్‌గా అటు టిడిపి అనుకూల మీడియాలో, జగన్ అనుకూల మీడియాలో వచ్చిన పరిశీలిస్తే అర్థమయ్యేది ఒక్కటే. భూమానాగిరెడ్డికి సంబంధించిన సమాచారాన్ని బాగానే ఇచ్చారు కానీ వైసిపి తరపున రోజా, శ్రీకాంత్‌రెడ్డి, భూమనకరుణాకర్రెడ్డిలు, టిడిపి తరపున బోండా ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి, వర్ల రామయ్యలాంటి వాళ్ళు చేయాల్సిన పనిని కూడా ఈ మీడియా సంస్థలే చేసేశాయోమోననిపిస్తోంది. అందుకేనేమో రెండు పార్టీల తరపు నుంచీ ఆయా నాయకులు ఎలాంటి రాజకీయ అవకాశవాద డైలాగులు వినిపించలేదు. కానీ అలాంటి రాజకీయ నాయకుల స్థాయికి పడిపోయిన తెలుగు మీడియాను తల్చుకుంటేనే ఆ రాజకీయ నాయకులు కూడా జాలి పడే పరిస్థితి ఉందనడంలో సందేహం లేదు.