ఓవైపు దిగ్గజ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో బాధ పడుతోంటే, ప్రాణాలతో పోరాడుతోంటే.. కొన్ని ఛానళ్లు తొందరపడ్డాయి. వెర్రి ఉత్సాహాన్ని చూపించాయి. `బాలు ఇక లేరు` అంటూ శ్రద్ధాంజలి ఘటించేశాయి. అవి చూసి… సోషల్ మీడియాలో బాలు లేరన్న `రిప్` సందేశాలు మొదలయ్యాయి. ఇవన్నీ బాలు అభిమానుల్ని, సంగీత ప్రియుల్ని మరింత ఆందోళనలోకి నెట్టేశాయి. `బాలు ఇంకా చనిపోలేదు. ఆయన ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు` అని సన్నిహితులు చెబుతున్నా – `రిప్`లు ఆగలేదు. బడా బడా ఛానళ్లే `బాలు లేరు` అన్న స్క్రోలింగులతో కాసేపు హోరెత్తించాయి. ఇలా తొందరపడి ముందే కూయడం ఛానళ్లకు కొత్తేం కాదు. బాలు విషయంలోనే ఇది రెండోసారి. సెలబ్రెటీల విషయంలో ఇలా తొందరపడడం ఏమాత్రం భావ్యం కాదన్న విషయం ఈ ఛానళ్లకు తెలీదా? లేదంటే… ముందే తామే ఈ విషయాన్ని చెప్పేసి, ఆ ఖ్యాతి తమ ఖాతాలో వేసుకోవాలన్న పైచాచిక ఆనందమా? ఇదే మళ్లీ మళ్లీ రిపీట్ అయితే… అంతంత మాత్రంగానే ఉన్న ఛానళ్ల రెపిటేషన్ పూర్తిగా పడిపోవడం ఖాయం.