వారం రోజులు సెలవు కావాలి.. భార్యని పుట్టింట్లో వదిలి పెట్టి వస్తా అని అడిగిన ఉద్యోగికి… రెండు రోజుల్లో వెళ్లిరా అని చెబుతుంది బాస్. అలా ఎలా కుదురుతుందండి… వెళ్లడానికి ఎంత దూరమో.. రావడానికి కూడా అంతే దూరం కదా..అని అతి తెలివి ప్రదర్శించబోతాడు ఉద్యోగి. దానికి బాస్ తగ్గట్లుగానే రిప్లయ్ ఇస్తుంది… ఒకటి నుంచి 30కి ఎన్ని రోజులు.. ముఫ్పై నుంచి ఒకటికి ఎన్నిరోజులు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి… అతని అతి తెలివిని… అతనితోనే బయటపెట్టించి.. సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి సీన్ ఇప్పుడు జరిగింది. ఉద్యోగి ప్లేస్‌లో కేంద్రం నిలబడింది..బాస్ ప్లేస్‌లో మీడియా నిలబడింది. కేంద్ర ప్రభుత్వ పరువు అడ్డంగా పోయింది.
అసలు విషయం ఏమిటంటే… కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసిందని…కరోనా దెబ్బకు జనం చస్తున్నా పట్టించుకోకుండా.. వ్యాక్సిన్ డోసుల కోసం కనీసం ఆర్డర్ కూడా పెట్టలేదని మీడియా సంచలన విషయాలు బయట పెట్టింది. రెండు రోజుల పాటు తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత కేంద్రం స్పందించింది. తూచ్.. మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని.. తాము పెద్ద ఎత్తున కోవిడ్ వ్యాక్సిన్లు ఆర్డర్ పెట్టామని… కోవిషీల్డ్, కోవాగ్జిన్‌కు అడ్వాన్సులు కూడా ఇచ్చామని చెప్పుకొచ్చింది. పిల్లికి ఎలుక సాక్ష్యమన్నట్లుగా రాజకీయ ప్రకటనలు చేయడంలోనూ రాటుదేలిపోయిన సీరం ఇనిస్టిట్యూట్ యజమాని అదర్ పూనావాలా కూడా మాకు కేంద్రం పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చిందని ప్రకటన చేసేశారు. కానీ ఇక్కడ అసలు విషయాన్ని చెప్పలేదు. అదేమిటంటే.. అసలు ఆ ఆర్డర్స్ ఎప్పుడు ఇచ్చారు అని..!?
ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన … వ్యాక్సిన్లకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. అప్పటికే మీడియాలో గగ్గోలు రేగడం ప్రారంభమయింది. మీడియాలో కథనాలు పెరిగిపోయిన తర్వాత మూడో తేదీన వివరణ ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే… గత నెలలోనే ఆర్డర్స్ ఇచ్చామని చెప్పుకుంది. నిజానికి గత నెలఅంటే.. నెలాఖరు రోజుల్లో అన్నమాట. విషయం మీడియాకు తెలిసి ప్రజల దృష్టికి వెళ్తే పరువు పోతుదంని తెలిసిన తర్వాతనే వ్యాక్సిన్స్‌కు ఆర్డర్ ఇచ్చింది. దాన్నే… గత నెలలోనే ఇచ్చామని చెప్పుకుంటూ.. అస్మదీయ మీడియాతో.. ఇతర మీడియా సంస్థలపై ఎదురుదాడి చేస్తూ.. టైం పాస్ చేస్తోంది.
దేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆలోచించాల్సింది ప్రజల గురించి.. వాళ్ల ప్రాణాల గురించే. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం.. ఏదో పబ్లిసిటీ చేసుకుని టైంపాస్ చేస్తే ప్రజలు ఎవరి సావు వారు చస్తారు.. దేశం కోసం.. ధర్మం కోసం అని నమ్మేవాళ్లు తమను నమ్ముతారని ఫిక్సయిపోయినట్లుగా ఉంది. ఇలాంటి విన్యాసాలు చేస్తూ.. ప్రజల ముందు పరువుపోగొట్టుకుంటోంది.