ప్రత్యర్థులు తమపై ప్రయోగించే అస్త్రాన్ని వారిపైకే తిప్పడం విలువిద్యలోనే గాక రాజకీయాల్లోనూ జరుగుతుంటుంది. జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ అదే చేశారు. రెండు ప్రధాన పార్టీలైన టిడిపి, వైసీపీలు తనపై వేస్తున్న బాణాలను వారిపైకే తిప్పారు. తుని సభలో ఆయన ఆవేశంగా మాట్లాడుతూనే అలాటి చమత్కారాలు చేశారు. ప్రసిద్ధుడైన నటుడుగా వుండి రైలులో ప్రయాణిస్తూ ప్రజలతో ఇష్టాగోష్టిగా మాట్లాడ్డమే ఒక మంచి ఆలోచన. దాని కొనసాగింపుగా తుని సభ, ఆ మరుసటి రోజునే డ్వాక్రామహిళలతో భేటీ ఈ వరస చూస్తుంటే జనసేనకు ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక వుందనే అర్థమవుతుంది. ఈ సమయంలోనే హర్షకుమార్, వట్టి వసంత కుమార్ వంటి వారి రాజకీయ కదలికలు మరింత ఆసక్తి రేపుతాయి.
తుని ప్రసంగంలో పవన్ తనపై విమర్శలకు నిరాధార కథనాలకు నిశితమైన సమాధానం ఇచ్చారనుకోవాలి. వైసీపీతో ఇప్పటికే ఆయన అవగాహనకు వచ్చారని ఎబిఎన్ఆంద్రజ్యోతి చాలా సార్లు పేర్కొంది. ఇప్పటికి వైసీపీ ఆయనను టిడిపి నుంచి పూర్తిగా విడిగా చూడకుండా గతంలో బలపర్చడమే ప్రధానంగా చెబుతుంటుంది. ఇక టిడిపి నేతలైతే పవన్ జగన్ బిజెపితో కలసి పోయారని నిరంతరం చెబుతుంటుంది.
వీటికి సమాధానంగా పవన్ మొదట ట్వీట్ ఇచ్చారు – మాకు ఏ పెద్ద పార్టీ అండ అక్కర్లేదని. తుని సభలో ఇంకా సూటిగా మాట్లాడారు. అన్నకే భయపడని వాణ్ని మోడీకి భయపడతానా అని ప్రశ్నించారు. అంతకంటే ముఖ్యం- మాకు వ్యతిరేకంగా వైసీపీ టిడిపి కలసి పోవచ్చని కూడా అన్నారు. తనను అటో ఇటో కలిపి చూపేవారికి జవాబుగా ఆ ఇద్దరిని కలపడం కొత్త ట్విస్టు. తద్వారా తనంటే వారిద్ధరికి భయమని ముక్తాయింపు కూడా వుంది.
తమాషా ఏమంటే మీడియా సంస్తలు కొన్ని పవన్ మాటల్లో సగం తీసుకుని సగం వదిలేయడం.. కాంగ్రెస్‌తో టిడిపి చెలిమిని ఖండిస్తూ అంత అవసరమైతే నా దగ్గరకు వస్తే నేనే మద్దతు నిచ్చేవాణ్ని కదా అన్నది విమర్శ, నిజానికి ఈసడింపు. దాని ఆధారంగా అయితే పవన్ టిడిపితో మళ్లీ కలుస్తారా అని చర్చ చేసేవారిని ఏమనాలి? అందులోనూ కాంగ్ర్స్తో కలయికను సమర్థించుకుంటున్నప్పుడు. తేటతెల్లంగా కనిపించే సత్యాలను వదలిపెట్టి పాలక పక్షాల చుట్టూ చర్చ తిరిగేందుకు వీలైన కోణాలు తీసుకుని గంటలకొద్ది చర్చలు చేయడం కథనాలివ్వడం చాలా విడ్డూరమైన విషయం దటీజ్ మీడియా టుడే!.ఇంకా విచిత్రమైన మరో విషయం వుంది. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ పంచె కట్టుకుని తిరిగారు. తన తల్లిగారు విరాళం ఇచ్చేందుకు వచ్చిన తరుణంలో మామూలు ప్యాంటు షర్టులో కనిపించారు. వెంటనే ఒక ఛానల్ ఈ డ్రస్సు మార్పుపై కథనం వండి వార్చింది. ఏవేవో లాజిక్కులు తీసుకొచ్చింది. స్వతహాగా నటుడైన వ్యక్తి వేషధారణలో మార్పులు ఏమంత విశేషం? 70వ ఏట ఎన్టీఆర్ వేటగాడి గెటప్‌లో లక్ష్మీపార్వతిని తీసుకుని బస్సెక్కి ప్రచారానికి బయలుదేరారు. ఆయనకు బద్ద వ్యతిరేకి అయిన అప్పటి గవర్నర్ కుముద్ బెన్ జోషి హూ ఈజ్ దిస్ యంగ్‌మాన్ అంటూ కథ రక్తికట్టించారు.