జనాలు ఏది చూస్తే అదే వార్త అనుకుంటాయి న్యూస్ చానల్స్. వారు ఏది చూపిస్తే అదే చూస్తున్నామంటారు జనం. ఎవరిది కారణం అయినా అసలు వార్తల కన్నా ఊహాగానాలు.. గాసిప్స్ మీదే చానల్స్ రేటింగ్స్ బండి నడిపించుకుటూ ఉంటున్నాయి. వారికి ఓ ఇష్యూ దొరకాలంతే. కాస్త సెలబ్రిటీ టచ్ ఉంటే అంతకంటే కావాల్సిందేమీ లేదు. ఇప్పుడు మీడియాకు కేసినో కథలు దొరికాయి. స్వయంగా దర్యాప్తు చేసి కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
చీకోటి ప్రవీణ్‌పై ఈడీ దాడులు జరిగిన తర్వాత రెండు, మూడు రోజుల నుంచి అదే పనిగా న్యూస్ ప్రసారం చేస్తున్నాయి. సినిమా తారలకు డబ్బులిచ్చారని వాళ్ల పేర్లు సహా బయట పెట్టేశారు. నిజానికి ఇచ్చారో లేదో ఈడీ తేల్చాలి. వాళ్లు కేసినో ప్రమోషన్స్‌లో పాల్గొన్నారని వివిధ మార్గాల ద్వారా తెలుసుకుని ఇలా ప్రచారం ప్రారంభించారు. అందులో వాళ్ల తప్పేముంది.. వాళ్ల వృత్తే అది. అది చట్ట విరుద్ధం కూడా కాదు. కానీ వారేదో తప్పు చేసినట్లుగా మీడియా పేర్లు..ఫోటోలతో హోరెత్తించేసింది. వారు ఇప్పుడు తామేదో చేయకూడని తప్పు చేశామని బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు.
ఇక రాజకీయ నేతల్నీ వదులడం లేదు. వాళ్లంట వీళ్లంట అంటూ ఊహాగానాలు ప్రచారం చేస్తోంది. ఇరవై మందిఎమ్మెల్యేలు .. కీలక నేతలు హవాలా అంటూ చెబుతోంది. హింట్స్ కూడా ఇస్తోంది. దీంతో వారికీ టెన్షన్ ప్రారంభమయింది. అందరికీ ఈడీ నోటీసులు ఇస్తున్నట్లుగా చెబుతోంది. వాళ్లిస్తారో లేదో కానీ మీడియా మాత్రం ఇచ్చేస్తోంది. ఓ రకంగా దర్యాప్తు చేసి నోటీసులు ఇవ్వాలని ఈడీకి చెబుతున్నట్లుగా ఉంది. ఈడీ కన్నా ముందే మీడియా దర్యాప్తు చేస్తోంది.
గతంలో డ్రగ్స్ కేసుల్లోనూ.. సెలబ్రిటీలతో సంబంధం ఉన్న కేసుల్లోనూ మీడియా ఇలాగే హడావుడి చేసింది. ఇప్పుడూ చేస్తోంది. ఇక మీడియా పనే ఇది అని అనుకోవాలేమో ?