ఏదైనా ఓ ఇష్యూ మొదలైతే… దాన్ని వాడుకొని టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి టీవీ ఛానళ్లు ఏమైనా చేస్తాయి. ఎంతకైనా వెళ్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం చూస్తుంటే.. మీడియా మరోసారి ఓవరాక్షన్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. డ్రగ్స్ లిస్టులో ఉన్న 12 మంది సినీ ప్రముఖుల జాబితా బయటకు వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ తీరిక లేకుండా… వరుస కథనాలతో, కవరేజీలతో అదరగొడుతున్నాయి ఛానళ్లు. ఈరోజైతే.. ఆ పిచ్చి పీక్స్ కి వెళ్లింది. పూరిని ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌ని ఏ రేంజులో చూపిస్తున్నారంటే.. పూరి ఓ దేశ ద్రోహి అయినట్టు, ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఓ నేరగాడు ఇప్పుడు దొరికినట్టు.. బిల్డప్పులిస్తున్నారు. విచారణ కోసం ఇంటి దగ్గర్నుంచి బయలు దేరినప్పటి నుంచీ సిట్ ఆఫీసుకు వచ్చేంత వరకూ పూరిని ఫాలో అవుతూ లైవ్ కవరేజీలు ఇస్తున్నాయి ఛానళ్లు.
పూరి లోపలకు వెళ్లాక ఏయే ప్రశ్నలు అడగొచ్చు అంటూ ఓ టీవీ ఛానల్ ప్రశ్నాపత్నం కూడా తయారు చేసింది. విచారణ సమయంలో పూరి మానసిక స్థితి ఎలా ఉండొచ్చు, బ్లడ్ శాంపిల్స్ తీసుకోనే అవకాశం ఉందా, లేదా? అంటూ… యమ సీరియెస్‌గా చర్చలు మొదలెట్టేశారు. నిజానికి పావలా సీన్ ఉన్న ఈ కేసుని మీడియా ఓవర్ వల్ల. ఇదేదో దేశ సమస్య అన్నంత బిల్డప్ సృష్టిస్తోంది మీడియా. దేశంలో, రాష్ట్రంలో ఇన్ని వ్యవహారాలు జరుగుతుంటే, అవేంట పట్టనట్టు రేపో మాపో చల్లారిపోయే విషయాన్ని పట్టుకొని వేలాడుతున్న మీడియాని చూసి జాలి పడడం, ఓవరాక్షన్‌ని చూసి నవ్వుకోవడం మినహా ఏం చేయగలం??