ఉద్యోగాలకోసం వెళ్లేవారు ఇంటర్వ్యూలలో నెగ్గవలసి వుంటుంది. అదే రాజకీయాలకు వచ్చేసరికి ఎన్నికలలో నెగ్గి పదవులు చేపట్టిన వారు కూడా మీడియా ఇంటర్వ్యూలను నెట్టుకురావడం ఒక అనివార్యమైన అవసరం. రాజకీయ నాయకులందరూ మాటకారులూ లేదా సమయస్పూర్తి గలవారూ కానక్కరలేదు. తమ పార్టీవారినో ప్రభుత్వాధికారులనో ఎదుర్కొవడం వేరు, ప్రతికూల ప్రశ్నలు కూడా వేసే మీడియాను తట్టుకోవడం వేరు. అందుకే రాహుల్‌గాంధీ ఆర్నబ్ గోస్వామికి తొలి ఇంటర్వ్యూ ఇవ్వడం పెద్ద వార్తయింది.నరేంద్ర మోడీ చాలా కాలం మీడియాను దూరం పెట్టారు. ఇప్పటికి మోడీ విదేశీ మీడియాకు ఇచ్చిన ప్రాధాన్యత దేశీయ సంస్థలకు ఇవ్వరని ఫిర్యాదు వుంది. ప్రస్తుతానికి వస్తే ఎపి మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేశ్ ఇటీవల పత్రికలు ఛానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందరినీ ఒకేసారి పిలిపించారంటే రాజకీయంగానే నిర్ణయం తీసుకుని వుండాలి. కొంతమంది అమరావతిలో ప్రతినిధులే ఇంటర్వ్యూ చేస్తే మరికొందరు సీనియర్లు హైదరాబాదు నుంచి వెళ్లి వచ్చారు. ఏమైనా ఇవన్నీ ముగిసిన తర్వాత లోకేశ్ రాజకీయంగా సమాధానాలివ్వడంలో ఫర్వాలేదని సీనియర్ జర్నలిస్టులకు పరిశీలకులకు కలిగిన అభిప్రాయంగా చెబుతున్నారు. ఇప్పుడు జరిగే చర్చల సరళికి తగినట్టే లోకేశ్ రాజకీయ ఆరోపణలకు ప్రశ్నలకు విసుర్లకు బాగానే సమాధానం చెప్పారట. తన శాఖకు సంబంధించి అడిగిన వారికి కూడా జవాబులిచ్చారు. అయితే మొత్తంగా ప్రభుత్వ విధానాలు కీలకమైన నిర్ణయాలు కేటాయింపుల వంటి అంశాల్లో మాత్రం ఇంకా పట్టుపెంచుకోవలసి వుందని చూసిన చేసిన వారు వ్యాఖ్యానించారు. లోకేశ్ వరకూ వ్యక్తిగత ఆరోపణలు వ్యంగ్యాస్త్రాలపై ప్రశ్నలు వేసే కంటే విధానాల పరంగా రాజకీయంగా అడిగిన వాటినే ఎక్కువగా ఆహ్వానించి ఆస్వాదించినట్టు అలా చేసిన వారిపట్ల అభినందనగా మాట్లాడినట్టు చెబుతున్నారు. బాధ్యతలు మోయాల్సిందే గనక మరింత మెరుగుపడాలని కోరుకుందాం.