రెండు మూడు రోజులలో టీవీలలో కూర్చుని మొత్తం చెబుతానని కేసీఆర్ ప్రకటన చేసి..రోజులుగా గడిచిపోతున్నాయి. టీవీలు రెడీ అయ్యాయి కానీ ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. ఒకటి కాదు.. రెండు అత్యంత కీలక విషయాల్లో కేసీఆర్ నుంచి ఈ తరహా ప్రకటనలు వచ్చాయి. అందులో మొదటిది కాళేశ్వరం.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీవీలలో కూర్చుని తానే అసలు విషయాలు చెబుతానని ప్రకటించారు. ఇది ప్రకటించి దాదాపుగా నెల కావొస్తుంది.కానీ మర్చిపోయారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా తాను రెండు రోజుల్లో చెబుతానన్నారు. మళ్లీఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అటు కాళేశ్వరం గురించి కానీ.. ఇటు ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ ఆయన మాట్లాడతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
కేసీఆర్ మాట్లాడితే మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకూ చూపించడానికి టీవీలు రెడీ అయిపోయాయి. గతంలోలా ప్రతిపక్ష నేతలకు కవరేజీ రాకుండా టీవీల్ని నియంత్రించే రాజకీయం ఇంకా ప్రారంభం కాలేదు. నిజం చెప్పాలంటే.. ఇప్పటికీ మీడియాలో బీఆర్ఎస్ దే ఆధిపత్యం. అధికారం పోయింది కాబట్టి కాస్త అధికారపక్షంపై భయభక్తులు పాటిస్తోంది మీడియా. అందుకే ఇప్పుడు మీడియా ముందుకు రావడం ఆలస్యం ఆయన చెప్పేవన్నీ ప్రజలకు చేరుతాయి.
కానీ మేడిగడ్డ కుంగిపోవడం.. ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎలా సమర్థించుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే కేసీఆర్ వెనుకాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.