జగన్ వెళ్లి రామోజీరావుని కలిస్తే యావత్ మీడియా తన మేధాశక్తికి పదునుబెట్టి వారి సమావేశం గురించి చాలా చాలా వ్రాసింది. కానీ వారిద్దరూ ఏమి మాట్లాడుకొన్నారో ఎవరికీ తెలియదు. అదే మీడియా ప్రజా సమస్యలపై వార్తలు ప్రచురించాలంటే తటపటాయిస్తుంది! సమాజాన్ని మీడియా వాచ్ చేస్తుంటే, మీడియాని వాచ్ చేసే సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటి ఒక సంస్థ మీడియా గురించి కొన్ని దిగ్బ్రాంతికరమయిన విషయాలు బయటపెట్టింది.
హైదరాబాద్ లో హైటెక్ సిటీ సమీపంలో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ “ఎలియన్స్ స్పేస్ స్టేషన్-1” అనే ఒక వెంచర్ వేసింది. అనేకమంది ప్రజలు తమ జీవితకాలం కష్టపడి పోగుచేసుకొన్న తమ డబ్బునంతా ధారపోసి అందులో ఇళ్ళు బుక్ చేసుకొన్నారు. దాదాపు పదేళ్ళు పూర్తవుతున్నా డబ్బు చెల్లించిన వారెవరికీ ఇళ్ళు కేటాయించలేదు. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ వారి డబ్బు వాపసు కూడా చేయలేదు. వారివద్ద నుండి వసూలు చేసిన డబ్బుతో ఇళ్ళు నిర్మించి ఇవ్వకుండా ఆ డబ్బును వేరే అవసరలాకు మళ్ళించినందునే ఇళ్ళ నిర్మాణం జరుగలేదు. ఇళ్ళు బుక్ చేసుకోన్నవారి డబ్బు వాపసు చేయడం లేదని భాదితులు ఆరోపిస్తున్నారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి సుమారు 1500 కుటుంబాలు బలయిపోయాయి. అది ఒకటీ రెండు కోట్లు కాదు సుమారు రూ.300కోట్ల కుంభకోణం. బాధితులకి ఇళ్ళు రాకపోయినా వారి జీతాల్లో నుండి నెలనెలా అసలు, వడ్డీలు కట్ అయిపోతున్నాయి. వారిలో కొందరు స్థానిక పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేయగా మరికొందరు సదరు రియల్ ఎస్టేట్ సంస్థపై కోర్టులో కేసులు కూడా వేశారు. అయినప్పటికీ వారి రోదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. బహుశః ఇటువంటి బాధితులు దేశ వ్యాప్తంగా చాల మందే ఉండిఉంటారు. కానీ ఇలాగ వెలుగులోకి వచ్చేవి మాత్రం కొన్నే ఉంటాయి.
మీడియా ద్వారా వారు తమ బాధను తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో సెప్టెంబర్ 19, 2015న సోమాజీగూడా వద్దనున్న ప్రెస్ క్లబ్ లో భాదితులు ఒక మీడియా సమావేశం నిర్వహించారు. దానికి అన్ని మీడియా సంస్థల విలేఖరులు వచ్చేరు కూడా. కానీ ఆ విలేఖరులు కూడా బాధితులకు ఊహించలేని షాక్ ఇచ్చారు. బాధితులను విలేఖరులు వారి సమస్య గురించి ప్రశ్నించి అన్ని వివరాలు సేకరించారు. కొందరు విలేఖరులు సదరు రియల్ ఎస్టేట్ యాజమాన్యం తాలుక చిరునామా, ఫోన్ నెంబర్లు వగైరా అన్నీ అడిగి నాట్ చేసుకొన్నారు. అన్ని వివరాలు సేకరించిన తరువాత ఆ వార్తని ప్రచురించేందుకు భాదితులను డబ్బు డిమాండ్ చేసారు. తాము అడిగినంత డబ్బు చెల్లిస్తేనే రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన ఈ మోసం గురించి తమ మీడియాలో వార్తలు వచ్చేలా చేస్తామని చెప్పడంతో బాధితులు షాక్ అయ్యారు.
అయితే మీడియాలో పనిచేస్తున్న కొందరు విలేఖర్లు డబ్బులు డిమాండ్ చేయడం కొత్తేమికాదు. ప్రచురించవలసిన విషయానికి ఉన్న ప్రాధాన్యత (‘సీరియస్ నెస్’) ని బట్టి విలేఖరులు రూ.100 నుండి 5000వరకు డబ్బు డిమాండ్ చేసి తీసుకొంటున్నారని ఆ సంస్థ తెలియజేసింది. ఒక విషయం లేదా సమస్య గురించి కవరేజ్ ఇవ్వడానికి విలేఖరులు డబ్బు డిమాండ్ చేయడం అనైతికమే. కానీ అది మీడియాలో విలేఖరుల దుస్థితికి కూడా అద్దం పడుతోంది. మీడియాలో కొన్ని సంస్థలకి ఎంత గొప్ప పెరున్నప్పటికీ అవి విలేఖరులకు, కెమెరా మెన్ లకు చాలా తక్కువ జీతాలు చెల్లిస్తుంటాయి. ఇక స్థానికంగా మాత్రమే ప్రచురితమయ్యే చిన్నచిన్న పత్రికలలో పనిచేసే విలేఖరులు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కనుక వారు కేవలం రూ. 20లు డిమాండ్ చేసిన సందర్భాలు కూడా చాల ఉన్నాయి.
మీడియా సమాజంలో, ప్రభుత్వ, ప్రైవేట్ వ్య్వసతలలో పేరుకుపోయిన అవినీతిని బయటపెడుతుతుంది. కానీ మీడియాలోనే అవినీతి పేరుకుపోయింది. తమ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మిక చట్టాల ప్రకారం జీతాలు, అవసరమయిన సదుపాయాలు కల్పించవు. ఆ కారణంగానే విధిలేని పరిస్థితుల్లో విలేఖరులు బాధితుల నుండి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. మీడియాలో యాజమాన్య స్థాయి నుండి క్రింద వరకు అన్ని స్థాయిల్లో ఇటువంటి అనైతికత చోటు చేసుకొనే ఉంది. అందుకు విలేఖర్లను తప్పు పట్టడం కంటే సదరు యాజమాన్యాన్నే తప్పు పట్టవలసి ఉంటుంది.
కొస మెరుపు: ఆ ప్రెస్ మీట్ లో బాధితుల గోడు ఏ తెలుగు మీడియాలోను రాలేదు. బహుశః కారణాలు అవే అయ్యి ఉండవచ్చును. కానీ ఒక్క ‘ద హిందూ న్యూస్ పేపర్లో మాత్రం వచ్చింది.