గడచిన పది పదకొండు సంవత్సరాలుగా ప్రజలకు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఆనందించాలో, ప్రస్తుత సమావేశాలలో జరిగే చర్చలు,అరుపులు, గలాటాలు చూస్తూ సభాసమయము వృధా అవుతుందని బాధపడాలో లేక విలువైన తమ సమయం వృధా అయిందని ప్రజలు బాధపడాలో తెలియని పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో 2004,2009 మరియు 2014 సభలలో ముఖ్యమంత్రి కధానాయకుడుగా, ప్రతిపక్ష నాయకుడు ప్రతినాయకుడుగా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా పరిస్థితి ఇలానే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలు లేనపుడు కేవలం సభలో జరిగే విషయాలు, చర్చలు కేవలం పత్రికల ద్వారానే తెలిసేది. కానీ ఆ రోజుల్లో సత్ప్రవర్తనతో శాసనాలు చేయటం, ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటటం , సొంత అధికార పార్టీ సభ్యులు కూడా తమ తమ నియోజక వర్గ సమస్యలను పరిష్కరించుకోవటానికి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవటం మనం చదువుకున్నాం. ఇపుడు ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోనికి తేవటం వలన సభ్యులు మరింత విజ్ఞతతో వ్యవహరించాల్సింది పోయి, ఈ సభ్యుల భాష చూస్తే ,స్కూలు పిల్లల కన్నా దారుణంగా కడు హీనంగా ప్రవర్తించటం, మాట్లాడటం తెలుగు భాషకే అవమానం. [pullquote position=”left”]తెలుగ దేల యెన్న దేశంబు తెలుగేను , తెలుగు వల్లభుండ తెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స, అన్న కృష్ణదేవరాయ అభివర్ణనను ప్రతిబింబించేటట్లు మాట్లాడితే సభ్యుల పేరు , శాసనసభ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేస్తుంది. [/pullquote]
తొలితరం నాయకుల్లో అక్షరాస్యులు తక్కువ నిరక్షరాస్యులెక్కువ అయినా నాటి తరం సభ్యులు సభలో హుందాగా , పార్టీలు వేరైనా విమర్శల్ని కూడా వ్యంగ్యంగా మరియు గౌరవప్రదమైన పదజాలంతో విమర్శించేవారు. కొన్ని సందర్భాలలో వ్యంగాస్త్ర విమర్శలకు గురైన సదరు సభ్యుడు కూడా నవ్వుతూ స్వీకరించిన పరిస్థితి. కానీ వర్తమానంలో కొంత మంది శాసనసభ్యులు అరుపులు, కేకలు , అన్ పార్లమెంటరీ పదాలు ఉచ్చరించి వారికి వారు హీరోలుగా భావించటం విచారకరం. ప్రస్తుత శాసనసభ సభ్యులు వారి పార్టీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మిగతా సభ్యులు బల్లలు చరుస్తూ అభినందించటం , ఎదుటి పార్టీ సభ్యులు మాట్లాడుతున్నపుడు అరుస్తూ కేకలు వెయ్యటం చూస్తుంటే వీరు ఇలా బల్లలు చరచడానికా? లేక వారనెన్నుకున్న ప్రజల అవసరాలను వారి సమస్యలను ప్రస్తావించడానికా ? అనేది ఆలోచించుకుని స్వీయ నియంత్రణ పాటించి తాము ప్రజలకు జవాబుదారీ అని గుర్తెరగాలి. [pullquote position=”right”]స్కూలు పిల్లల ప్రవర్తన స్కూలు అసెంబ్లీలో గమనిస్తే , స్కూలు అసెంబ్లీ పద్దతి ప్రకారం నడుస్తుంది. నేటి సభల్లోని సభ్యులను వివిధ కమిటీల్లో సభ్యులుగా నియమించి, పక్క రాష్ట్రాల్లోని ఆయా శాఖల పని తీరుని విశ్లేషించటానికీ మరియు అధ్యయనాలకు విదేశీ టూర్లకు పంపేకన్నా,ఏదైనా స్కూలు అసెంబ్లీ జరిగేటప్పుడు, వీరిని అధ్యయనానికి పంపిస్తే ప్రవర్తనలో పరివర్తన వస్తుందేమో అనిపిస్తుంది[/pullquote]
మీడియా రెండు విభాగాల్లో ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలలో కూడా గతం, వర్తమానంగా విభజిస్తే మీడియా కూడా ప్రత్యక్షంగా ఈ నాటి పరిణామాలకు కారణం అనిపించక మానదు. ప్రజలు కోరుకుంటున్నారో లేదో తెలియదు కాని, మీడియా మాత్రం ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటున్నట్లు ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రజలకు సినిమాలలాగే వినోదాన్ని పంచుతున్నాయని అనుకోవచ్చు. సినిమాల్లో ఆయా హీరోలు కల్పిత కథల్లో వారి హీరోయిజాన్ని అభిమానుల కోసం చూపుతారో , అలాగే నేడు పార్టీలు కూడా వారి వారి పార్టీల కార్యకర్తలు , సానుభూతి పరులకోసం రాజకీయ ఆరోపణలు, అవహేళనలు వారి వారి సభ్యులతో చేయించే పరిస్థితి చూస్తున్నాం తప్ప ప్రజల కోసం చర్చించి , ప్రజా సమస్యలు తీర్చే దిశగా ఆలోచన చేసి , శాసనాలు చేద్దామని ప్రయత్నించకపోవటం , ఎటు పోతున్నామో అర్థం కాని స్థితి. గత సమావేశాలలో సభ్యులు బూతులు తిడుతూ ఉచ్చరించటానికి కూడా ఇబ్బంది పడే పదాలను ఉటంకిస్తూ ప్రసంగిస్తే సభలో సస్పెండ్ చేసే పరిస్థితి కూడా లేదు. మీడియా సంస్థలు పోటీ పడి ఒకరు సభా సమరం అని మరొకరు మరో టైటిల్ పెట్టి విపరీత ప్రాచుర్యం కల్పించటం మనం చూశాము. ఈ సమావేశాలలో అలాంటివి ఏమి జరుగుతాయో వేచి చూడాలి. సభాసమావేశ విషయాల్లో మీడియా నిగ్రహం పాటించి, కొన్ని పరిధుల్ని ,పరిమితుల్ని ఏర్పరుచుకుని స్వీయనియంత్రణెరిగి ,తప్పుగా మాట్లాడినా సభ్యసమాజం అసహ్యిoచుకునే అన్ పార్లమెంటరీ భాష విషయంలో ముక్తకంఠoతో ఖండిస్తే తదుపరి మార్పుని మనం ఆశించవచ్చు. [pullquote position=”left”]టి.ఆర్.పి రేటింగ్స్ కోసం తిట్టిన వారిని ,తిట్టించుకున్న వారిని ఆయా స్టూడియోలకి పిలిచి ,ఇంటర్వ్యూలను పదే పదే ప్రసారం చేసి వారిని చర్చల పేరిట మళ్లీ ఆరోపణలు ప్రత్యారోపణలు పదే పదే చూపించటం సమాజహితమా అని మీడియా సంస్థలు ఆలోచించాలి[/pullquote]. ఇలా ప్రసారం చేస్తూ ఇంత పబ్లిసిటీ ఇస్తుంటే ఈ సంస్కృతి పెరిగిపోదా? పట్టుమని పది మంది శాసనసభ్యులు కూడా వారి వారి నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించి వాటిని పరిష్కరించిన దాఖలాలు భూతద్ధం పెట్టి వెతికినా కనపడదు. గతంలో ఆఫ్ ద రికార్డ్ , ఆన్ రికార్డ్ సంభాషణలకు వ్యత్యాసం ఉండేది. ప్రజల ముందుకొచ్చినప్పుడు, మీడియా ముందుకొచ్చినప్పుడు ఏ పార్టీ సభ్యులైనా ఆ వ్యత్యాసం కనిపించేది. నేడు అది కరువయ్యింది. ఆఫ్ ద రికార్డ్ మాటలకన్నా నేడు ఆన్ రికార్డ్ మాటలు దారుణంగా ఉన్నాయంటే విద్య విజ్ఞానాన్ని పెంచుతుందా అనిపిస్తుంది.
నేటి సభలోని సభ్యులు, టీవీ లలో కనిపిస్తున్నాం, చర్చలకు ,స్టూడియోలకు వస్తున్నాం అని ఏదో ఒకటి మాట్లాడటం, వివేకం కోల్పోయి విమర్శించుకోవటం భాధాకరం. ప్రింట్ మీడియా ప్రజా సమస్యల పరిష్కారానికి సభలో ప్రస్తావించి, పరిష్కరించిన వార్తలను మాత్రమే పతాక శీర్షికల్లో పెట్టాల్సిన తరుణం ఆసన్నమయింది.
మీడియా సంస్థలు కూడా నిజంగా ప్రజల అవసరాలను ప్రస్తావించిన సభ్యుల గురుంచి 30 మినిట్స్, స్టోరీ బోర్డులు లాంటివి ప్రసారం చేస్తే అన్నా , చట్ట సభలోని సభ్యులు, ప్రజల ప్రాధమిక అవసరాలైన ప్రాధమిక విద్య, ఉన్నత విద్య, వైద్యం,ఆరోగ్యం,ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, రోడ్లు, త్రాగునీరు, సాగునీరు, పశు వైద్యశాలలు ఇలా ఎన్నో నిర్వీర్యమైపోయిన శాఖలు , సర్కారు ఆసుపత్రులు, విద్యాలయాలు, మరియు ప్రజల బాధలు అవసరాలను పరిష్కరించటానికి వీరు ప్రయత్నిస్తారేమో . బ్రిటిష్ కాలంలో కూడా పై వ్యవస్థల్లో కొన్ని ఇప్పటికన్నా నాడు బాగున్నాయి. ఆ దిశగా మీడియా సంస్థలు కృషి చేసి చట్టసభలోని సభ్యుల్ని వారి కర్తవ్యం నిర్వర్తించే దిశగ పరిస్థితుల్ని మరియు అలా కృషి చేసే సభ్యుల గురించి వార్తల్ని ప్రసారం చేస్తూ , మార్పు దిశగా పయనిస్తుందని ఆశిద్ధాం. ఆస్తికి హద్దులున్నట్లే, ఆశకు కూడా హద్దులుండాలి గానీ , ఇలా ఆశించటం అత్యాశ కాదేమో, ఆశిద్ధాం అశావాదులుగా.
యార్లగడ్డ వెంకట్రావు,
డల్లాస్, టెక్సాస్
yarlagadda9999@yahoo.com