మీడియా వల్లే మాకీ పరిస్థితి. మీరెవరూ రావొద్దంటూ….! .. మారుతీరావు ఆత్మహత్య విషయం తెలిసిన తర్వాత ఆయన ఇంటికి పోలోమని వెళ్లిన మీడియా ప్రతినిధులకు.. ఆయన భార్య నుంచి వచ్చిన ఈసడింపు ఇది. నిజానికి ఇది ఈసడింపు కాదు.. ద్వేషం కాదు… అసహనం కాదు.. అంతకు మించి ఉంది. దానికి భాష లేదు. భావ వ్యక్తీకరణ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే.. మీడియా వారిని అంతగా బాధపెట్టింది మరి. వారి కుటుంబాన్ని వెంటాడి.. వేటాడింది..!
మారుతీరావు కుటుంబాన్ని మీడియా వెంటాడిందా..?
ఎదుటి వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోని సీక్రెట్లను.. అడ్డగోలుగా టీవీల్లో చూపించి.. టీఆర్పీలు పెంచుకునే… సన్సెషనలిజం టైప్ ప్రొఫెషనలిజానికి.. తెలుగు మీడియా ఎప్పుడో దిగజారింది. ముందు ఒకటి ఆ టైప్‌లో సక్సెస్ అయ్యాయని చెప్పి అందరూ అదే దారిలో పయనమైనయ్యారు. మెరుగైన సమాజం కోసం అని చెప్పే టీవీ చానళ్లలో వచ్చిన వార్తల వల్ల.. చేసిన సెన్సేషనలిజాల వల్ల.. ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో లెక్కే లేదు. విజయనగరంలో.. ఇద్దరు విద్యార్థులు అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ.. వాళ్ల వీడియోను.. ముఖాలు గుర్తు పట్టేలా ప్రసారం చేసి.. వారిలో ఒకరి తల్లి ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిన ఘటన… నుంచి.. ఇప్పటి మారుతీరావు వరకూ.. టీవీ చానళ్లు చెలరేగిపోయాయన్నది వాస్తవం. మారుతీరావు కుటుంబాన్ని అయితే మరీ దారుణంగా వెంటాడారు. తీర్పులిచ్చేసి.. చెడామడా తిట్టేశారు.
ఆ సాంగ్ వీడియో లేకపోతే మీడియా పట్టించుకునేదా..?
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ప్రేమోన్మాద ఘటనలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లాలోనే… ప్రేమించారని.. ప్రేమికుడ్ని చంపేసి తగలబెట్టిన ఘటనలు ఆ తర్వాత కూడా వెలుగుచూశాయి. కానీ.. దేనికి ఇవ్వనంత ప్రాధాన్యత మీడియా.. మారుతీరావు కుటుంబానికి ఇచ్చింది. ఆ కుటుంబం పరువుగా భావించే కుమార్తె.. ప్రేమించిన వ్యక్తితో కలిసి రూపొందించుకున్న వీడియో… కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా మీడియాకు దొరికింది. అంతే అప్పట్నుంచి వదిలి పెట్టలేదు. మారుతీరావును వెంటాడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా వదిలి పెట్టలేదు.
మీడియా కుటుంబాలను టార్గెట్ చేస్తే ఇవే పరిణామాలు..! కానీ ఆలోచించేదెవరు..?
టీఆర్పీల మాయలో పడి కొట్టుకుపోతున్న టీవీ చానళ్లు.. ప్రజల వ్యక్తిగత కుటుంబ విషయాలను.. నేరాలను… హైలెట్ చేసి.. వ్యక్తుల్ని.. నిందించడం ద్వారా లేదా.. పొగడటం ద్వారా.. సర్వైవ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ.. అలా చేయడం ఏ మీడియా లక్షణమో చెప్పాలి. నాడు… మెరుగైన చానల్.. మారుతీరావును.. కర్కోటకుడని.. ఆయనను నిలబెట్టి కాల్చి చంపినా తప్పులేదన్నట్లుగా ప్రసారాలు చేసింది. ఇప్పుడు చనిపోయాడని.. ఆయనకు కూతురంటే చచ్చేంత ఇష్టమని చెప్పి.. సానుభూతి మాటలు చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల వల్లే.. మీడియా.. విలన్‌గా మారుతోంది. వాళ్లు తెలుసుకోరు.. చెప్పినా వినరు. కానీ.. మారుతీరావు భార్య ఆవేదనలో మాత్రం నిజం ఉంది.