భారతదేశ మీడియా అత్యుత్సాహానికి మిస్టర్ కూల్ మహేందర్ సింగ్ ధోనీ కూడా… పంటి బిగువున కోపాన్ని అణుచుకోవడానికి… తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనే ఉంటాడు. ఎందుకంటే.. మీడియా ఆయనకు రిటైర్మెంట్ ప్రకటించేసింది. ఎన్ని గంటలకు ప్రెస్ మీట్ పెడతారో కూడా డిసైడ్ చేసింది. ఏం చెబుతారో కూడా ఉహాగానాలు బ్రేకింగ్‌ల రూపంలో… ప్రకటించేసింది. ఓ వైపు గణేష్ నిమజ్జన మహోత్సవం జరుగుతూండగానే.. దానికి కూడా బ్రేక్ వేసి.. ధోనీ కెరీర్‌ను ఇంతటితో నిమజ్జనం చేసేయాలని.. మీడియా చూపిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. దేశ ప్రజలంతా… ముఖ్యంగా ధోనీ ఫ్యాన్స్ ఇది నిజం కాకూడదని కోరుకుంటూ.. ధోనీ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూశారు. కానీ అసలు అలాంటి ప్రెస్‌మీటే ఏర్పాటు చేయలేదని తెలిసి.. రిలీఫ్ ఫీలయ్యారు. మీడియాను తిట్టుకున్నారు.
జట్టులో చోటివ్వకపోతే రిటైర్మెంట్ ప్రకటించేస్తారా..?
ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు.. మహేందర్ సింగ్ ధోనీ వెళ్లలేదు. ఆయన సైన్యంలో పని చేయడం లాంటి కమిట్ మెంట్స్ పెట్టుకుని స్వచ్చందంగా వైదొలిగాడు. అయితే.. దక్షిణాఫ్రికా .. భారత్‌కు వచ్చే సిరీస్‌లలో అందుబాటులో ఉంటారని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే.. ధోనీ కానీ.. బీసీసీఐ కానీ.. సెలక్టర్లు కానీ.. దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ…జట్టులో చోటు మాత్రం దక్కలేదు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ధోనీకి అవకాశం కల్పించలేదని చీఫ్ సెలక్టర్ వివరణ కూడా ఇచ్చారు. అంతమాత్రానికే ధోనీకి ఆగ్రహం వచ్చి రిటైర్మెంట్ ప్రకటిస్తారని మాత్రం ఎవరూ అనుకోలేదు. కానీ మీడియా మాత్రం ఊహించేసింది.
కోహ్లీ ట్వీట్‌ను అలా అర్థం చేసుకున్న మీడియా..!
గతంలో ధోనీతో కలిసి ఆడిన ఓ ఇన్నింగ్స్‌లో… చేసిన పరుగులు.. తీసిన పరుగులు గురించి కోహ్లీ..ఓ ట్వీట్లో గుర్తు చేసుకున్నారు. అదే.. ధోనీ రిటైర్మెంట్కు సూచిక అనుకున్న మీడియా.. చిలువలు పలువలుగా కథలు అల్లేసింది. ప్రెస్ మీట్ సమయాన్ని కూడా ప్రకటించింది. కానీ తీరా ఆ సమయం వచ్చే సరికి.. అలాంటిదేమీ లేదని క్లారిటీ వచ్చేసింది. ధోనీ భార్య సాక్షి ఈ వార్తలను చూసి నవ్వుకుంది. అలాంటిదేమీ లేదని.. స్పష్టం చేసింది. దాంతో ధోనీ ఫ్యాన్స్ .. క్రికెట్ లవర్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ధోనీకి తగ్గట్లుగా దిగ్గజ స్థాయిలో బీసీసీఐ వీడ్కోలు ఉంటుంది..!
ధోనీ ఓ లెజెండ్..! ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటే.. కచ్చితంగా బీసీసీఐకి సమాచారం ఇస్తారు. బీసీసీఐ కూడా.. ధోనీ లాంటి లెజెండ్‌కు.. ఆయన స్థాయిలోనే… వీడ్కోలు ఏర్పాట్లు చేస్తుంది. చేయకపోవడానికి చాన్స్ కూడా లేదు. ధోనీ అందరికీ ఇష్టమైన ప్లేయరే. రెబలిజం ఉన్న ప్లేయర్ కాదు. అజాతశత్రువులాంటి ప్లేయర్. ధోనీకి.. మీడియా.. ఆ మాత్రం గొప్ప వీడ్కోలు లభించకూడదని అనుకుంటుందో ఏమో కానీ.. వినాయక నిమజ్జనం రోజే… ధోనీ కెరీర్ ని కూడా నిమజ్జనం చేయాలని తాపత్రయ పడింది.