సాధారణం ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారంటే.. మీడియా ఇప్పటి వరకూ వారికి మద్దతు ఇచ్చేది. బలహీనులకు తాము అండగా ఉంటామని.. అధికారవర్గాల దాష్టీకానికి ఎదురొడ్డి నిలబడతామని మీడియా చెప్పుకునేది. అయితే రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి. నిన్నామొన్నటి వరకూ… ప్రభుత్వంపై ఎవరైనా తిరగబడుతూంటే.. చూసీచూడనట్లు మీడియా ఉండేది. ఇప్పుడు.. వారికి వ్యతిరేకంగా.. ప్రభుత్వానికి మద్దతుగా మారుతూ… ఎగసే గొంతుల్ని అణచాలని చూస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విషయంలో మీడియా కవరేజీ తీరు ప్రధానంగా అదే చెబుతోంది.
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లలో టాప్ టూలో ఉండే రెండు చానళ్లు.. ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులతే తప్పన్నట్లుగా.. కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా… అద్భుతం… అపూర్వం అంటూ.. కీర్తించేస్తూ.. బ్రేకింగ్‌లు వేస్తున్నాయి. అంతే కాదు.. కార్మికులు… ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారంటూ… ఇతరులు అన్న మాటలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రసారం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ… ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల… ప్రజలెవరూ ఇబ్బంది పడటం లేదని… తాత్కాలిక ఏర్పాట్లతో ప్రభుత్వం ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసిందని.., నేరుగానే వార్తలు ప్రసారం చేస్తున్నారు. సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్న వారికే అసలు నిజం లేదు. కానీ మీడియా మాత్రం… ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ.. కార్మికుల పోరాటాన్ని తక్కువ చేసి చూపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది.
మీడియాలో ఇప్పుడు.. యాజమాన్యాలు మారాయి. వారి ప్రాధాన్యాలు మారాయి. మీడియా ముసుగులో వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న విషయం స్పష్టంగానే కనిపిస్తోందన్న అభిప్రాయం.. అంతటా వ్యక్తమవుతోంది. మీడియా ఎప్పుడూ పాలకపక్షం ఉండకూడదు. ప్రజల పక్షమే ఉండాలి. ప్రతిపక్ష పాత్రే పోషించాలి. కానీ ఇప్పుడు.. పరిస్థితి స్పష్టంగా మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజల వేళ్లతో ప్రజల కళ్లనే పొడిచి… తమ తమ యాజమాన్యాల వ్యాపార ప్రయోజనాలకు… అండగా నిలబడేదిశగా మీడియా… కొత్త రూపానికి వెళ్తోంది. ఇది.. ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో మరి..!