ఆంధ్రాలో మీడియా స్వేచ్ఛ అందరికీ తెలిసిందే! అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉండాల్సిందే అనే ధోరణి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సొంతం రాష్ట్రం కాబట్టి ఎవరి పొలిటికల్ ఇంట్రెస్టులు వారికి ఉంటాయిలే అనుకుందాం! పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను చూస్తూనే ఉన్నాం. అక్కడి రాజకీయాలపై ఆంధ్రా మీడియా సంస్థలకు కూడా పొలిటికల్ స్టాండ్స్ ఉంటాయని అనుకోలేం కదా! పన్నీర్ సెల్వానికో, లేదా శశికళకో మద్దతుగానో.. లేదా, మరోరకంగానో ప్రజాభిప్రాయాన్ని ప్రోది చేయాల్సిన అవసరం మన మీడియా సంస్థలకు ఏముంటుందండీ అనుకుంటాం! తమిళ ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉండదు కదా. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది కాబట్టే ఈ ఉపోద్ఘాతం అవసరమైంది.
పన్నీర్ సెల్వమ్ క్యాంపు మీద తెలుగు మీడియాలో కొంతమంది ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. పన్నీర్‌కు మద్దతుగా నిలుస్తూ కథనాలు వస్తున్నాయి! అమ్మకు అత్యంత విధేయుడిగా.. తమిళనాడుకు అత్యవసరమైన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్ని ప్రెజెంట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో శశికళ గతాన్నీ, కేసుల్నీ, అమ్మతో ఆమె వైరాన్నీ, అమ్మ మరణం సమయంలో ఆమె పాత్రనీ… ఇలాంటి కథనాలు గుమ్మరిస్తున్నాయి. ఇక్కడితో ఆగితే బాగుండేది! మరో అడుగు ముందుకేసి.. ఇప్పుడు పన్నీర్‌కు సగం కంటే ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనీ, చాలామంది ముఖ్య నేతలు సెల్వమ్ క్యాంపులో చేరిపోయారంటూ కథనాలు వస్తున్నాయి.
శశికళ వర్గంలో కలవరం మొదలైందనీ, సుప్రీం కోర్టు తీర్పు ఏ క్షణానైనా రావొచ్చనీ, ఆమెకు తిప్పలు తప్పకపోవచ్చనీ… ఈ రేంజిలో కథనాలు చేయాల్సిన స్పెషల్ ఇంట్రెస్ట్ మనకెందుకు అనే ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది కదా! తెలుగు మీడియాలో ఒక వర్గానికి పన్నీర్ మీద అంత ప్రేమ పెంచుకోవాల్సిన పనేముంది అని అనిపిస్తుంది కదా? జాగ్రత్తగా గమనిస్తే.. ఇప్పుడు పన్నీర్ ఎలా మనవారయ్యారో అర్థమౌతుంది!
ప్రస్తుతం పన్నీర్ సెల్వమ్ భాజపాకి అత్యంత ఆప్తుడు అయిపోయారు. కాబట్టి, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకీ ఆప్తుడేగా! ఆ లెక్కన వెంకయ్య బంధువులకు కూడా పన్నీర్ కొత్త బంధువు అయిపోయినట్టేగా..! అలాంటి బంధువులు ఆంధ్రాలో ఉన్నారుగా. మరి, ఆ బంధువుకు అనుకూలమైన మీడియాకు కూడా పన్నీర్‌తో బంధుత్వం వచ్చేసినట్టే..! కాబట్టి, ఇప్పుడు తెలుగు మీడియాలో ఓ వర్గానికి పన్నీర్‌పై ప్రేమ పొంగుకొచ్చేస్తోంది..!